India vs Sri Lanka: ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన భారత్.. అక్షర్, సూర్య అర్ధశతకాలు వృథా-sri lanka won by 16 runs against india 2nd t20i ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Sri Lanka: ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన భారత్.. అక్షర్, సూర్య అర్ధశతకాలు వృథా

India vs Sri Lanka: ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన భారత్.. అక్షర్, సూర్య అర్ధశతకాలు వృథా

Maragani Govardhan HT Telugu
Jan 05, 2023 11:12 PM IST

India vs Sri Lanka: పుణె వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. చివరి వరకు పోరాడిన టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అక్షర్, సూర్యకుమార్ అర్ధశతకాలు వృథా అయ్యాయి.

భారత్-శ్రీలంక
భారత్-శ్రీలంక (PTI)

India vs Sri Lanka: భారత్‌తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లంక జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ విఫలం కావడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అక్షర్ పటేల్(65), సూర్యకుమార్ యాదవ్(51) అర్ధశతకాలతో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జట్టును ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. భారత్ 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో దసున్ శనకా, కసున్ రజితా, దిల్షాన్ మధుశనకా తలో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు.

207 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభమేమి దక్కలేదు. రెండో ఓవర్లోనే ఇషాన్(2)ను రజీతా బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో శుబ్‌మన్ గిల్‌ను(5) ఔట్ చేసి ఘోరంగా దెబ్బతీశాడు. ఆ తదుపరి ఓవర్ మొదటి బంతికే రాహుల్ త్రిపాఠిని(5) దిల్షాన్ మధుశనకా ఔట్ చేయడంతో 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. మరి కాసేపట్లోనే కెప్టెన్ హార్దిక్ పాండ్య(12) కూడా కరుణ రత్నే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

అనంతరం కాసేపు సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా(9) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడినప్పటికీ స్కోరు మాత్రం ముందుకు సాగలేదు. అనంతరం దీపక్‌ను కూడా హసరంగా వెనక్కి పంపాడు. దీంతో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా ప్రయాణించింది భారత్. ఇలాంటి సమయంలో అక్షర్ పటేల్, సూర్యకుమార్ అదరగొట్టారు. తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. వరుసగా మూడు ఓవర్లలో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు వేగాన్ని పెంచారు.

ముఖ్యంగా వానిందు హసరంగా వేసిన బౌలింగ్‌లో అక్షర్ 3 సిక్సర్లు బాదగా.. మొత్తం ఆ ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి. ఆ తదుపరి ఓవర్లోనూ 16 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ధాటిగా ఆడుతూ టీమిండియాను గెలుపు అంచున ఉంచారు. 2 ఓవర్లలో 33 పరుగులు అవసరం కాగా.. 19 ఓవర్ వేసిన రజితీ 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో కెప్టెన్ శనకా 5 పరుగులు సహా అక్షర్ పటేల్, శివమ్ మావిని(26) కూడా ఔట్ చేసి లంక జట్టును విజయతీరాలకు నడిపాడు. చివరి వరకు పోరాడిన భారత్‌ ఓటమితో సరిపెట్టుకుంది. 207 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ 1-1 తేడాతో సమమైంది.

సంబంధిత కథనం