Hardik Pandya on Arshdeep Singh: అర్ష్‌దీప్ చెత్త రికార్డు.. నోబాల్స్ వేయడం ఓ క్రైమ్ అన్న హార్దిక్ పాండ్యా
Hardik Pandya on Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ వరుస నోబాల్స్‌తో ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకూ టీ20ల్లో ఏ ఇండియన్ బౌలర్ నమోదు చేయని రికార్డు అది. మరోవైపు నోబాల్ వేయడం క్రైమ్ అని మ్యాచ్ తర్వాత హార్దిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
Hardik Pandya on Arshdeep Singh: శ్రీలంకతో రెండో టీ20లో ఏదో చేస్తాడనుకున్న పేస్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. టీమ్ కొంప ముంచాడు. వరుస నోబాల్స్‌తో ఓ చెత్త రికార్డు నమోదు చేయడంతోపాటు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ ఏ ఇండియన్ బౌలర్ నమోదు చేయని రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
టీ20ల్లో వరుసగా మూడు నోబాల్స్ వేసిన తొలి ఇండియన్ బౌలర్ అర్ష్‌దీపే కావడం గమనార్హం. తన తొలి ఓవర్లోనే అతడిలా హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బంతి అందుకున్న అర్ష్‌దీప్.. ఐదో బంతికి తొలి నోబాల్ వేశాడు. ఆ తర్వాతి బాల్ వైడ్ వేశాడు. ఆ తర్వాత బాల్‌కు బౌండరీ సమర్పించుకోగా.. అది కూడా నోబాల్ అని తేలింది. ఇక వరుసగా మూడో బాల్ కూడా నోబాల్ వేయగా.. ఆ బాల్‌కు కుశల్ మెండిస్ సిక్స్ బాదాడు.
ఇలా తాను వేసిన తొలి ఓవర్లోనే అర్ష్‌దీప్ మూడు నోబాల్స్, ఓ వైడ్ సహా మొత్తం 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది చూసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా షాక్ తిన్నాడు. చాలా రోజుల తర్వాత టీమ్‌లోకి వచ్చిన ఈ లెఫ్టామ్ పేస్ బౌలర్.. తొలి ఓవర్లోనే ఈ చెత్త రికార్డు నమోదు చేశాడు.
నోబాల్ వేయడం ఓ క్రైమ్: హార్దిక్
మ్యాచ్ తర్వాత అర్ష్‌దీప్ నోబాల్స్‌పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. అతన్ని నిందించడం లేదు కానీ.. నోబాల్స్ వేయడం ఓ క్రైమ్ అని పాండ్యా అనడం గమనార్హం. "అతడు"గతంలోనూ నోబాల్స్ వేశాడు. అతన్ని నిందించడం కాదు కానీ.. నోబాల్ వేయడం ఓ క్రైమ్" అని మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతూ హార్దిక్ అన్నాడు.
ఇంతకుముందు కూడా గతేడాది హాంకాంగ్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ వరుసగా రెండు నోబాల్స్ వేశాడు. ఇప్పుడు తన రికార్డును తానే మెరుగుపరచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా కొన్ని ప్రాథమిక తప్పులు చేసిందని, ఇలా చేయకూడదని హార్దిక్ అన్నాడు.
"బ్యాటింగ్, బౌలింగ్ పవర్‌ప్లేలలో మేము విఫలమయ్యాం. ఈ స్థాయిలో చేయకూడని ప్రాథమిక తప్పులు చేశాం. మనం నియంత్రించగలిగే ప్రాథమిక విషయాలను నేర్చుకోవాలి. ఆటలో ఒక రోజు బాగుండకపోవచ్చేమో కానీ ఇలా ప్రాథమిక విషయాలను మరచిపోకూడదు" అని హార్దిక్ అన్నాడు. రెండో టీ20లో అక్షర్ పటేల్ పోరాడిన 16 రన్స్ తేడాతో ఇండియాను ఓడించిన శ్రీలంక.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
సంబంధిత కథనం