Dinesh Karthik About Chahal: చాహల్ తుది జట్టులో లేకపోవడంపై దినేశ్ కార్తిక్ స్పష్టత.. ఏమన్నాడంటే?
08 January 2024, 22:09 IST
- Dinesh Karthik About Chahal: టీ20 ప్రపంచకప్‌లో భారత్ తుది జట్టులో యజువేంద్ర చాహల్ ఆడకపోవడపై దినేశ్ కార్తిక్ స్పందించాడు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంలో స్పష్టత ఉండే చేశారని తెలిపాడు.
చాహల్ తుదిజట్టులో ఆడకపోవడంపై దినేశ్ కార్తిక్ స్పందన
Dinesh Karthik About Chahal: టీమిండియా అనూహ్యంగా టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఓడిపోయి అభిమానులను నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ వైఫల్యానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ జట్టు కూర్పు ప్రధాన సమస్యగా మారిందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. యజువేంద్ర చాహల్ జట్టులో లేకపోవడం ఈ సమస్యల్లో ముఖ్యమైంది. 2021 ఎడిషన్ మాదిరిగా కాకుండా.. టీమిండియా అతడిని జట్టులోకి తీసుకుంది. కానీ ఈ సారి తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం ఇవ్వలేదు. హర్షల్ పటేల్‌ను కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. వీరిద్దరూ తుది జట్టులో తీసుకోకపోవడంపై కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు.
"ఈ విషయంపై వారు(ద్రవిడ్, రోహిత్) కచ్చితంగా ఉండటం వల్ల ఒక్కసారి కూడా బాదపడలేదు. టోర్నీ ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితుల్లో ఆడతామని, లేకపోతే కష్టమని వారు ముందే చెప్పారు. కాబట్టి వారు ఆట పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు ఆడే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కోచ్, కెప్టెన్‌కు స్పష్టత ఉంటే ఆటగాడికి పెద్ద కష్టం ఉండదు. లోతుగా వెళ్లి ఆలోచిస్తే.. ఎవరికైతే అవకాశం వచ్చిందో.. వారు కచ్చితంగా తమ బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఆశించినట్లుగా జట్టులో ఎలాంటి ప్రతికూల వాతావరణం, లోటుపాట్లు లేవు." అని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు.
టీ20 ప్రపంచకప్‌లో తుది జట్టులో చాహల్‌కు బదులు రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్నందుకు రోహిత్, రాహుల్ ద్రవిడ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. హర్షల్ పటేల్‌ను కూడా తీసుకోలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పొట్టి ప్రపంచకప్ వైఫల్యం తర్వాత భారత్.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి నిచ్చారు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో కివీస్‌తో మూడు టీ20ల సిరీస్ గురువారం నుంచి ఆరంభమైంది. ఈ రోజు మ్యాచ్ వర్షం కారణంగా టాస్ వేయుకండానే రద్దయింది. అనంతరం ఆదివారం నాడు రెండో టీ20లో భారత్-న్యూజిలాండ్ ఆడనున్నాయి. టీ20 సిరీస్ తర్వాత శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది భారత్.