Ashwin Cursed Dinesh Karthik: బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు దినేశ్ కార్తిక్‌ను తిట్టుకున్నాను.. అశ్విన్ వ్యాఖ్యలు-ravichandran ashwin says i cursed dinesh karthik when i walked in to bat ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin Cursed Dinesh Karthik: బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు దినేశ్ కార్తిక్‌ను తిట్టుకున్నాను.. అశ్విన్ వ్యాఖ్యలు

Ashwin Cursed Dinesh Karthik: బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు దినేశ్ కార్తిక్‌ను తిట్టుకున్నాను.. అశ్విన్ వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Oct 26, 2022 11:15 AM IST

Ashwin Cursed Dinesh Karthik: చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సందర్భంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్.. ఆ సమయంలో దినేశ్ కార్తిక్‍‌ను తిట్టుకున్నట్లు స్పష్టం చేశాడు.

అశ్విన్
అశ్విన్ (AP)

Ashwin Cursed Dinesh Karthik: ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందించిన క్రికెటర్ ఎవరు? ఇంకెవరు విరాట్ కోహ్లీనే.. 53 బంతుల్లో 82 పరుగులు చేసిన అద్భుతంగా ఆడాడు. అవును నిజమే.. ఇంకెవరైనా ఉన్నారా? హార్దిక్ పాండ్యా.. ఉన్నాడుగా అంటారు.. అవును నిజమే.. బ్యాట్, బంతి రెండింటితోనూ ఆకట్టుకున్నారు. ఇంకా? ఇంకా అంటే అర్ష్‌దీప్ సింగ్ ఉన్నాడుగా.. పాక్ ప్రమాదకర బ్యాటర్లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్‌ను ఔట్ చేశాడు. అవును అర్ష్‌దీప్ కూడా బాగా ఆడాడు.. ఇంకా ఎవరైనా ఉన్నారా? బాగా ఆలోచించండి.. అవును ఉన్నాడు.. అతడే రవిచంద్రన్ అశ్విన్. బౌలరై ఉండి చివరి బంతికి సింగిల్ తీసి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేకాకుండా 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 23 పరుగులతో పొదుపుగా బౌలింగ్ చేశాడు.

భారత విజయానికి ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమైన సందర్భంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్.. తన ఆటతీరు, తెలివితో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తన మైదానానికి వచ్చే ముందు ఒక్క క్షణం పాటు తిట్టుకున్నానని స్పష్టం చేశాడు.

“నేను బ్యాట్ తీసుకుని మైదానంలో అడుగుపెట్టేటప్పుడు ఒక్క క్షణం దినేశ్ కార్తీక్‌ను తిట్టుకున్నాను. కానీ వెంటనే లేదు మనకు ఇంటా టైమ్ ఉందని, ఏదోకటి చేయాలని అనుకున్నాను. పెవిలియన్ నుంచి పిచ్ వరకు వెళ్లేటప్పుడు ఎంతో సమయం పట్టిందనిపించింది.” అని అశ్విన్ అన్నాడు.

“మహమ్మద్ నవాజ్ చివరి బంతిని వేసినప్పుడు ఆ బాల్ లెగ్ సైడ్ రావడం గమనించాను. దాన్ని కదిలించకుండా ఉంటే చాలని అనుకున్నాను. ఫలితంగా బంతి వైడ్‌ వెళ్లింది. దీంతో ఫలితం ఒక్క బంతికి ఒక్క పరుగుగా మారడంతో కాస్త ఉపశమనం తీసుకున్నాను.” అని అశ్విన్ తెలిపాడు.

చివరి బంతి ఒక్క పరుగు తీయాల్సివచ్చినప్పుడు కోహ్లీ తనకు ఎన్నో విషయాలను చెప్పాడని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.

"అప్పుడు నేను కోహ్లీని చూశాను. అతడు నాకు చాలా విషయాలు చెప్పాడు. కానీ అతడిని చూసిన తర్వాత ఒకే ఒక్క విషయం గురించి ఆలోచించాను. "ఈ రోజు దేవుడు నీకు(కోహ్లీ) ఇచ్చాడు. కాబట్టి నిన్ను నిరాశ పరచకూడదని భావించాను. కాబట్టి నీ కోసం గెలుస్తాను" అని మనస్సులో అనుకున్నాను. నవాజ్ బంతిన వేయగానే రవూఫ్ తలపై నుంచి బ్యాక్‌పుట్‌లో స్క్వేర్ లెగ్ దిశగా కొట్టాను. దేవుడి దయ వల్ల అక్కడ ఎవరూ లేరు. ఒక్క పరుగు వచ్చింది. మ్యాచ్‌లో గెలిచాం." అని అశ్విన్ వివరించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం