Virat Kohli: కోహ్లీ సెంచరీల గురించి ఆలోచిస్తాం..అదే అసలు సమస్య.. చాహల్ వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అతడి సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్ స్పందించాడు. కోహ్లీ చేసిన 60, 70ల పరుగులను పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ అతడి సెంచరీల గురించే ఆలోచిస్తారని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం టీమిండియా అభిమానులను కలవరపెడుతోన్న సమస్య విరాట్ కోహ్లీ ఫామ్. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సెంచరీ చేసి కోహ్లీ దాదాపు వెయ్యి రోజులు పూర్తయింది. సెంచరీ మాట అటుంచితే.. నిలకడ లేమితో క్రీజులో ఎక్కువగా ఉండలేకపోతుండటం బాధిస్తోంది. ఐపీఎల్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఘోరంగా విఫలమైన విరాట్ నుంచి అదిరిపోయే ఇన్నింగ్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రానున్న ఆసియా కప్‌లోనైనా రాణించాలని ఆశిస్తున్నారు. అతడి ఫామ్‌పై మాజీలు సైతం విమర్శలు గుప్పించడం గమనార్హం. తాజాగా ఈ విషయంపై టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్పందించాడు. సెంచరీ అసలు మ్యాటరే కాదని, కోహ్లీ తన టైమ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఎన్నో ఆడాడని గుర్తు చేశాడు.
"కోహ్లీ టీ20ల్లో 50కి పైగా సగటుతో ఆకట్టుకున్నాడు. రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 70కి పైగా సెంచరీలు నమోదు చేశాడు. అన్ని ఫార్మాట్లలో అతడి సగటును చూశారా? అసలు సమస్య ఏంటంటే మనమందరం అతడు సెంచరీల గురించే ఆలోచిస్తాం. 60 నుంచి 70 మధ్య అతడు చేసిన విలువైన పరుగుల గురించి పట్టించుకోము." అని చాహల్ అభిప్రాయపడ్డాడు. "అతడు క్రీజులో ఉండి.. 15, 20 పరుగులు చేసి ఉన్నట్లయితే ఏ బౌలర్ కూడా అతడికి బౌలింగ్ చేయకూడదని అనుకుంటాడు" అని చాహల్ స్పష్టం చేశాడు.
విరాట్ కెప్టెన్సీతో పాటు రోహిత్ శర్మ సారథ్యంలో ఆడటంపై చాహల్ స్పందించాడు. "కెప్టెన్లు మారినప్పటికీ నా పాత్ర ఎప్పుడు ఒకేలా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ నన్ను వికెట్ తీసుకే బౌలర్‌గా చూస్తారు. నాక్కూడా వాళ్లిద్దరూ ఒకటే. బౌలర్‌గా నాకు ఆ స్వేచ్ఛ ఉంది. నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే వారు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సమయంలో నువ్వేమి చేస్తావ్? అని కొన్నిసార్లు రోహిత్ భాయ్ నన్ను అడుగుతుంటాడు. బౌలర్‌గా మీరు ఏ ఓవర్‌లోనూ రిలాక్స్ అవ్వకూడదు" అని చాహల్ స్పష్టం చేశాడు.
ఈ నెల 27 నుంచి ఆసియా కప్ జరగబోతోంది. ఆగస్టు 28 ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ 15వ ఎడిషన్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా ఆరుజట్లతో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఇప్పటివరకు అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఏడు సార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. గత ఎడిషన్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించగా.. ఈ సారి మాత్రం టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
సంబంధిత కథనం