Rohit Sharma: విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన రోహిత్.. ఎందులో అంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం నాడు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
సెయింట్ కిట్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 5 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఇందులో ఓ ఫోర్, ఓ సిక్సర్ కూడా ఉన్నాయి. అనంతరం అస్వస్థతకు గురైన అతడు రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. హిట్ మ్యాన్‌కు నడుము వెనుక భాగంలో గాయమైందని కాసేపటి తర్వాత బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత బీసీసీఐ వైద్య సిబ్బంది అతడిని పర్యవేక్షిస్తోందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ చేసిన తక్కువ పరుగులే అయినప్పటికీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 34 ఇన్నింగ్స్‌ల్లో 60 సిక్సర్లు బాది.. అంతకు ముందు అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. కోహ్లీ 50 మ్యాచ్‌ల్లో 59 సిక్సర్లతో ఇప్పటి వరకు ముందుండేవాడు. తాజాగా అతడిని హిట్ మ్యాన్ అధిగమించాడు. కోహ్లీ తర్వాత ఎంఎస్ ధోనీ 34 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం హిట్ మ్యాన్ మాట్లాడాడు. ఈ గాయం మరీ అంత సీరియస్ కాదని స్పష్టం చేశాడు. వచ్చే రెండు మ్యాచ్‌లకూ అందుబాటులో ఉంటానని తెలిపాడు. ప్రస్తుతానికి బాగానే ఉన్నా. తర్వాతి గేమ్‌కు ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. అంతా బాగానే ఉంటుందని ఆశిస్తున్నా అంటూ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
సూర్యకుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయ్యర్ తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బౌలర్లకు ఈ పిచ్ బాగా అనుకూలించింది. ఇది అంత సులభమైన లక్ష్యమేమి కాదు. సరైన బంతులకు రైన షాట్లు ఆడటం చాలా ముఖ్యం. అని రోహిత్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఓ ఓవర్ మిగిలుండానే ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్(76) అర్ధశతకంతో అదరగొట్టగా.. రిషభ్ పంత్(33) చివర్లో మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లలో డోమనిక్ డ్రైక్స్, జేసన్ హోల్డర్, అకీల్ హోసెన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులతో కాపాడుకోగలిగే స్కోరు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్(73) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్