తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cristiano Ronaldo: యూరోకప్‌లో ముగిసిన రొనాల్డో శకం.. క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన పోర్చుగల్

Cristiano Ronaldo: యూరోకప్‌లో ముగిసిన రొనాల్డో శకం.. క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన పోర్చుగల్

Hari Prasad S HT Telugu

06 July 2024, 7:41 IST

google News
    • Cristiano Ronaldo: పోర్చుగల్ లెజెండరీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో యూరోకప్ శకం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఆ టీమ్ ఫ్రాన్స్ చేతుల్లో ఓడిపోవడంతో తన చివరి టోర్నమెంట్లో టైటిల్ గెలవాలన్న ఆశ నెరవేరకుండానే రొనాల్డో వెళ్లిపోయాడు.
యూరోకప్‌లో ముగిసిన రొనాల్డో శకం.. క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన పోర్చుగల్
యూరోకప్‌లో ముగిసిన రొనాల్డో శకం.. క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన పోర్చుగల్ (AFP)

యూరోకప్‌లో ముగిసిన రొనాల్డో శకం.. క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన పోర్చుగల్

Cristiano Ronaldo: యూరోకప్ లో స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసింది. పోర్చుగల్ టీమ్ కథ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఫ్రాన్స్ చేతుల్లో పెనాల్టీ షూటౌట్లో ఆ టీమ్ 3-5తో ఓడిపోయింది. ఇదే తనకు చివరి యూరో కప్ అని ఈ మధ్యే అతడు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తన చివరి యూరో కప్ లో టైటిల్ గెలవాలన్న రొనాల్డో ఆశ తీరలేదు.

రొనాల్డో ఉత్త చేతులతో ఇంటికి..

2004లో తొలి యూరో కప్ ఆడిన రొనాల్డో.. మొత్తానికి రికార్డు స్థాయిలో తన ఆరో యూరోకప్ తో ఈ మెగా టోర్నీకి గుడ్ బై చెప్పాడు. ఎన్నో ఆశలతో క్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్ పోర్చుగల్ కు ఫ్రాన్స్ చేతుల్లో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ రెగ్యులర్ టైమ్ తోపాటు అదనపు సమయంలోనూ గోల్ నమోదు కాలేదు. రెండు జట్లు 0-0తో నిలిచాయి.

దీంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. ఇందులో ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్ ను చిత్తు చేసి రొనాల్డో ఆశలపై నీళ్లు చల్లింది. 39 ఏళ్ల రొనాల్డో తన చివరి యూరో కప్ లో టైటిల్ గెలవాలని ఆశించినా.. కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టాడు. మ్యాచ్ ఓడిన తర్వాత 41 ఏళ్ల పెపె దు:ఖం ఆపుకోలేక రొనాల్డోను పట్టుకొని గట్టిగా ఏడ్చాడు. అతన్ని రొనాల్డో ఓదారుస్తూ కనిపించాడు.

పెనాల్టీల్లో పోర్చుగల్ తరఫున తొలి గోల్ చేసింది రొనాల్డోనే. వరుసగా మూడు గోల్స్ తో పోర్చుగల్.. ఫ్రాన్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. అయితే సబ్‌స్టిట్యూట్ గా వచ్చిన జొవావో ఫెలిక్స్ బాల్ గోల్ పోస్ట్ కు తగిలి వెళ్లిపోవడంతో తొలిసారి మిస్సయింది. ఆ వెంటనే ఫ్రాన్స్ ప్లేయర్ థియో హెర్నాండెజ్ చివరి పెనాల్టీని గోల్ గా మలచడంతో ఫ్రాన్స్ లో ఆనందం వెల్లివిరియగా.. పోర్చుగల్ ప్లేయర్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ఇదే తన కెరీర్లో చివరి యూరో కప్ అని రొనాల్డో ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మెగా టోర్నీలో 20 ఏళ్ల అతని కెరీర్ ముగిసింది. అయితే 2026 వరల్డ్ కప్ వరకు అతడు జట్టులో కొనసాగుతాడా లేదా అన్నది చూడాలి.

సెమీఫైనల్లో ఫ్రాన్స్ vs స్పెయిన్

యూరో కప్ క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ ను ఓడించిన ఫ్రాన్స్.. సెమీఫైనల్లో స్పెయిన్ తో తలపడనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ టీమ్.. ఆతిథ్య జర్మనీకి షాకిచ్చింది. ఆ మ్యాచ్ లో ఎక్స్‌ట్రా టైమ్ లో మికెల్ మెరీనో చేసిన గోల్ తో స్పెయిన్ 1-0తో విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్, తుర్కియే.. ఇంగ్లండ్, స్విట్జర్లాండ్ మధ్య జరగబోయే క్వార్టర్స్ విజేతలు ఢీకొంటాయి.

పోర్చుగల్ తరఫున 2016లో యూరో కప్ గెలిచిన జట్టులో రొనాల్డో సభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు ఫైనల్లో ఇదే ఫ్రాన్స్ పై గెలిచింది పోర్చుగల్. ఇప్పుడు తన చివరి యూరో కప్ కూడా విజయంతో ముగించాలనుకున్నా.. క్వార్టర్ ఫైనల్లో అతని టీమ్ ఇంటిదారి పట్టింది.

తదుపరి వ్యాసం