Cristiano Ronaldo: ఆ టోర్నీకి రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‍బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. ఈ ఏడాదే ఆఖరు అంటూ..
Cristiano Ronaldo: యూరోపియన్ చాంపియన్‍షిప్ టోర్నీకి స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ఈ టోర్నీలో తనకు ఆఖరు అని స్పష్టం చేశాడు.
పోర్చుగల్ ఫుట్‍బాల్ స్టార్ ప్లేయర్, లెజెండ్ క్రిస్టోయానో రొనాల్డో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. పాపులర్ టోర్నీ యూరోపియన్ చాంపియన్‍షిప్‍కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది జరుగుతున్న యూరో 2024 ఎడిషన్ తనకు చివరి యూరోపియన్ చాంపియన్‍షిప్ అన్ని స్పష్టం చేశాడు.
క్వార్టర్ ఫైనల్‍లో అడుగు
యూరో 2024 లీగ్‍లో పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రీ-క్వార్టర్స్ పోరులో షూటౌట్‍లో 3-0 తేడాతో స్లోవేనియాపై ఆ జట్టు గెలిచింది. ఫుల్ టైమ్‍లో ఏ జట్టు గోల్ చేయలేకపోయింది. దీంతో షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‍లో 3-0తో పోర్చుగల్ గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ ప్లాన్‍ను క్రిస్టోయానో రొనాల్డో ప్రకటించాడు. ఇదే తనకు చివరి యూరోపియన్ చాంపియన్‍షిప్ ఎడిషన్ అని వెల్లడించాడు. కాగా, ఎక్స్‌టైమ్‍లో పెనాల్టీని మిస్ చేశాక రొనాల్డో బాధపడ్డాడు.
ఎలాంటి డౌట్ లేదు
యూరో 2024 ఎడిషన్ తనకు చివరి యూరోపియన్ చాంపియన్‍షిప్ అని, దీంట్లో ఎలాంటి డౌట్ లేదని క్రిస్టియానో రొనాల్డో స్పష్టం చేశాడు. “నిస్సందేహంగా ఇది నా చివరి యూరోపియన్ చాంపియన్‍షిప్. కానీ నేను దీని గురించి భావోద్వేగానికి గురికాను. ఆట పట్ల నాకు ఉన్న ఉత్సాహం, సపోర్టర్లు, నా కుటుంబం, నాపై ప్రేమ చూపించే వారి అభిమానం ఫుట్‍బాల్‍లో నన్ను కదిలిస్తుంది” అని రొనాల్డో చెప్పాడు.
ఎంత బలమైన వారికైనా కష్టమైన రోజులు ఉంటాయని రొనాల్డో చెప్పాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో తాను బలంగా నిలబడినట్టు చెప్పుకోచ్చాడు. “నేను ఈ ఏడాది ఒక్క పొరపాటు కూడా చేయలేదు. నాకు చాలా అవసరం అయినప్పుడు ఓబ్లేక్ (స్లోవేనియా వికెట్ కీపర్) అడ్డుకున్నాడు. ఆ సమయంలో నేను మిస్ చేసుకున్నా. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే చివరికి జట్టు గెలిచింది. నేను ఈ సీజన్‍లో రెండుసార్లు పెనాల్టీలను మిస్ చేశా. కానీ జట్టు మూడుసార్లు గెలిచింది. నేను కొన్నిసార్లు సరైన పనులు చేస్తా.. కొన్నిసార్లు పొరపాట్లు చేస్తా. కానీ నిరాశతో వదలడం అనేది నా నుంచి చూడలేరు” అని రొనాల్డో చెప్పాడు.
పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు క్రిస్టియానో రొనాల్డో 211 మ్యాచ్‍ల్లో 130 గోల్స్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‍బాల్‍లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా టాప్‍లో ఉన్నాడు. ఫ్రాంచైజీ లీగ్‍లతో పాటు దేశం తరఫున కూడా రొనాల్డ్ అద్భుతంగా ఆడుతున్నాడు. 2016లో పోర్చుగల్ యూరోపియన్ చాంపియన్‍షిప్ టైటిల్ గెలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. యూరో 2024 క్వార్టర్ ఫైనల్‍లో జూలై 5న పోర్చుగల్ తలపడనుంది.