Cristiano Ronaldo: మెస్సీ.. మెస్సీ అంటూ అరిచిన ఫ్యాన్స్: రొనాల్డో ఏం చేశాడో చూడండి
Cristiano Ronaldo: పోర్చుగల్, అల్ నసర్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సహనం కోల్పోయాడు. స్టేడియంలో ప్రేక్షకులు మెస్సీ.. మెస్సీ.. అంటూ అరవడంతో అతడు వాళ్లపై మండిపడటంతోపాటు అసభ్యకరంగా వ్యవహరించాడు.
Cristiano Ronaldo: మెస్సీ.. మెస్సీ అంటూ అభిమానులు అరవడంపై పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సహనం కోల్పోయాడు. ఆడుతోంది తానని, మెస్సీ కాదంటూ చాలా ఆగ్రహంగా ఫ్యాన్స్ వైపు దూసుకెళ్లాడు. మ్యాచ్ తర్వాత కూడా రొనాల్డో కాస్త అసభ్యకరంగా వ్యవహరించాడు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రొనాల్డో vs మెస్సీ
సమకాలీన ఫుట్‌బాల్ లో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీలను మించిన గొప్ప ప్లేయర్స్ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరు ప్లేయర్స్ ప్రపంచంలో ఎక్కడ ఆడినా వేల మంది ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చి చూస్తారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్స్ ప్రత్యర్థులు కూడా. ఒకరు పోర్చుగల్ కు, మరొకరు అర్జెంటీనాకు ఆడతారు. క్లబ్స్ విషయానికి వస్తే ఒకరు అల్ నసర్ కు, మరొకరు ఇంటర్ మియామీకి ప్రాతినిధ్యం వహిస్తారు.
అయితే అల్ నసర్ తరఫున రియాద్ సీజన్ కప్ ఫైనల్లో అల్ హిలాల్ తరఫున మ్యాచ్ లో రొనాల్డో తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీనికి కారణం స్టేడియంలో పదే పదే మెస్సీ.. మెస్సీ అంటూ వినిపించిన అరుపులే. ఈ మ్యాచ్ లో అల్ హిలాల్ 2-0తో రొనాల్డో టీమ్ అల్ నసర్ ను ఓడించింది. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్ కావాలని రొనాల్డోను లక్ష్యంగా చేసుకున్నారు.
మ్యాచ్ లో ఓ గోల్ చేయడానికి ప్రయత్నించి రొనాల్డో విఫలమయ్యాడు. దీంతో ఆ సమయంలో స్టేడియమంతా మెస్సీ మెస్సీ నినాదాలతో మార్మోగిపోయింది. దీంతో సహనం కోల్పోయిన రొనాల్డో.. అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. "ఆపండి.. ఇక్కడ ఆడుతున్నది నేను మెస్సీ కాదు" అంటూ అభిమానుల వైపు దూసుకెళ్తూ రొనాల్డో అన్నాడు. ఆ వీడియో వైరల్ అయింది.
రొనాల్డోకు ఏమైంది?
రొనాల్డో ఇలా చేయడాన్ని అల్ నసర్ టీమ్ సమర్థించింది. ఈ మ్యాచ్ లో అల్ హిలాల్ ప్లేయర్ గుస్తావో కుయెల్లర్ తో ఢీకొన్నప్పుడు రొనాల్డోకు గాయమైందని, ఫ్యాన్స్ తాను ఏం అనుకోవాలంటే అది అనుకోవచ్చని ఆ టీమ్ చెప్పింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత కూడా రొనాల్డో చేసిన పని అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈసారి ఫీల్డ్ బయట డగౌట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది.
ఓ అల్ హిలాల్ అభిమాని తమ క్లబ్ ఫ్లాగ్ ను రొనాల్డోపైకి విసిరేశాడు. కిందపడిన ఆ ఫ్లాగ్ తీసుకున్న రొనాల్డో.. తన ప్రైవేట్ పార్ట్ వైపు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దానిని పక్కన పారేశాడు. ఇది అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. రియాద్ సీజన్ కప్ లో భాగంగా ఇంటర్ మియామీ, అల్ నసర్ మధ్య కూడా మ్యాచ్ జరిగింది.
అయితే ఈ మ్యాచ్ కు గాయం కారణంగా మెస్సీ దూరమయ్యాడు. కానీ అల్ నసర్ తరఫున రొనాల్డో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్ లో ఇంటర్ మియామీ 0-6తో ఓడిపోయింది. మెస్సీకి ఉన్న క్రేజ్ రొనాల్డోను ఎంత అసహనానికి గురి చేస్తోందో తాజా ఘటనే నిదర్శనం అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేస్తున్నారు.