Lionel Messi: స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీపై చైనా ప్రభుత్వం, ఫ్యాన్స్ సీరియస్.. ఇదీ కారణం
Lionel Messi: అర్జెంటీనా, ఇంటర్ మియామీ స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీపై చైనా ప్రభుత్వం, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆదివారం హాంకాంగ్ లో స్థానిక జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు బరిలోకి దిగకపోవడమే దీనికి కారణం.
Lionel Messi: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ ఆడితే చూడాలని ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు కోరుకుంటారు. అతని చూడటానికి వేల కిలోమీటర్లు ప్రయాణించడంతోపాటు వేలు ఖర్చు పెట్టి టికెట్లు కూడా కొంటారు. చివరికి అతని ఆటను చూడలేకపోతే వాళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా చైనా ప్రభుత్వం, అభిమానులు మెస్సీపై ఇలాంటి ఆగ్రహమే వ్యక్తం చేస్తున్నారు.
హాంకాంగ్‌లో బరిలోకి దిగని మెస్సీ
గత ఆదివారం (ఫిబ్రవరి 4) హాంకాంగ్ లో స్థానిక జట్టుతో ఇంటర్ మియామీ టీమ్ ఓ మ్యాచ్ ఆడింది. ఇందులో మెస్సీ ఆడతాడన్న ఆశతో వేల మంది అభిమానులు చైనా నలుమూలల నుంచీ హాంకాంగ్ కు వచ్చారు. కొందరైతే 12 గంటలు ప్రయాణించి మరీ జిన్‌జియాంగ్ నుంచి వచ్చారు. కానీ మెస్సీ మాత్రం గాయం కారణంగా బెంచ్ కే పరిమితమయ్యాడు.
దీంతో మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఇంటర్ మియామీ జట్టుతోపాటు ఆ టీమ్ ఓనర్ డేవిడ్ బెక్‌హామ్ ను అభిమానులు హేళన చేస్తూనే కనిపించారు. స్టేడియంలోని 40 వేల మంది అభిమానులే కాదు.. ఆ తర్వాత చైనా వ్యాప్తంగా ప్రభుత్వం, అభిమానులు మెస్సీపై మండిపడ్డారు. నిజానికి ఈ మ్యాచ్ తర్వాత రెండు రోజులకే జపాన్ వెళ్లిన మెస్సీ అక్కడ విసెల్ కోబె జట్టుతో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో 30 నిమిషాలు ఆడాడు.
ఇది చైనా అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. నిజానికి అంతకుముందు సౌదీ అరేబియాలో అల్ నసర్ తో జరిగిన మ్యాచ్ లోనూ మెస్సీ ఆడలేదు. ఆ మ్యాచ్ లో ఇంటర్ మియామీ 0-6తో ఓడిపోయింది. దీంతో పాశ్చాత్య దేశాల స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ కావాలనే ఆసియా దేశాలను చిన్న చూపు చూస్తున్నారంటూ చైనా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెస్సీ రియాక్షన్ ఇదీ
చైనా ఫ్యాన్స్ తనపై మండిపడటంపై మెస్సీ తన అధికారిక వీబో అకౌంట్ ద్వార స్పందిస్తూ క్షమాపణ చెప్పాడు. "నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ నేను ఎప్పుడూ ఆడాలని అనుకుంటాననే తెలుసు. ముఖ్యంగా మేము ఎంతో దూరం ప్రయాణించి వచ్చి ఆడాల్సిన ఇలాంటి మ్యాచ్ లు కచ్చితంగా ఆడతాను. హాంకాంగ్ కు ఎప్పుడోసారి తిరిగి వచ్చి ఆడాలని కోరుకుంటున్నాను" అని మెస్సీ అన్నాడు.
మెస్సీ తీరుపై చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ అసంతృప్తి వ్యక్తం చేసింది. హాంకాంగ్ పట్ల మెస్సీ, ఇంటర్ మియామీ జట్టు భిన్నమైన ధోరణి అవలంభిస్తోందని ఆ పత్రిక విమర్శించింది. సీజన్ కు ముందు మెస్సీ ఆడే ఆరు ఫ్రెండ్లీ మ్యాచ్ లలో హాంకాంగ్ మ్యాచ్ లోనే అతడు ఆడలేదని, ఇది ఇంటర్ మియామీ, మెస్సీ చిత్తుశుద్ధిపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తోందని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది.
మెస్సీ ఆడితే చూడాలని చైనాలోని వేల మంది ఫుట్‌బాల్ ఫ్యాన్స్ 640 డాలర్లు చెల్లించి మరీ హాంకాంగ్ మ్యాచ్ చూడటానికి వచ్చారు. కానీ మెస్సీ బెంచ్ కే పరిమితం అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ ను ఆర్గనైజ్ చేసిన టట్లర్ ఏషియా సంస్థ ఏకంగా 20 లక్షల డాలర్లు ప్రభుత్వ ఫండింగ్ కోల్పోవడం గమనార్హం. నిజానికి మెస్సీ ఈ మ్యాచ్ ఆడటానికి ఫిట్ గా ఉన్నాడని ఇంటర్ మియామీ చెప్పిందని, అసలు సమయానికి అతడు తప్పుకున్నాడని టట్లర్ ఏషియా సీఈవో మిచెల్ లామునీర్ చెప్పడం గమనార్హం.