తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricketer Praveen Kumar Car Accident: మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం.. ఏం జరిగిందంటే?

Cricketer Praveen Kumar Car Accident: మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం.. ఏం జరిగిందంటే?

Hari Prasad S HT Telugu

05 July 2023, 12:11 IST

google News
    • Cricketer Praveen Kumar Car Accident: మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. మీరట్ లో అతడు కారులో వెళ్తున్న సమయంలో ఓ ట్రక్ దానిని ఢీకొట్టింది.
ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది
ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది

ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది

Cricketer Praveen Kumar Car Accident: టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. అతడు వెళ్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రవీణ్ తనయుడు కూడా కారులో ఉన్నాడు. అయితే ఈ ప్రమాదం నుంచి వాళ్లిద్దరూ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగింది. ఆ సమయంలో ప్రవీణ్ పాండవ్ నగర్ నుంచి తిరిగి వస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో ఓ ట్రక్కు చాలా వేగంగా వచ్చి ప్రవీణ్ నడుపుతున్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ప్రవీణ్, అతని కొడుకు బయటపడినా.. కారుకు మాత్రం చాలా డ్యామేజీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని, ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మీరట్ లోని ముల్తాన్ నగర్ లో ప్రవీణ్ కుమార్ ఉంటున్నాడు. ప్రవీణ్ కు ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు. 2007లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఢిల్లీ, మీరట్ రోడ్డుపై ఓపెన్ టాప్ జీపు నుంచి ప్రవీణ్ కింద పడ్డాడు. ఇండియన్ టీమ్ కు ఎంపికైన తర్వాత ఇంటికి వస్తున్న ప్రవీణ్ కు ఘన స్వాగతం పలికే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

బంతిని బాగా స్వింగ్ చేస్తాడని పేరున్న ప్రవీణ్ కుమార్.. టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మొత్తం అతడు ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 112 వికెట్లు తీసుకున్నాడు. 2007 నుంచి 2012 మధ్య అతడు టీమిండియాకు ఆడాడు. గతేడాదే టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ప్రమాదం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది.

తదుపరి వ్యాసం