Messi Born in Assam: మెస్సీ అసోంలో పుట్టాడు? కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ వైరల్
20 December 2022, 7:13 IST
- Messi Born in Assam: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి అసోంతో సంబంధం ఉందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడంపై అభినందిస్తూ ట్వీట్ చేయడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది.
లియోనల్ మెస్సీ
Messi Born in Assam: ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup 2022) ముచ్చటగా మూడోసారి అర్జెంటీనా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో విశ్వవిజేతగా నిలిచింది. లియోనల్ మెస్సీ(Lionel Messi) సారథ్యంలో అద్భుత ప్రదర్శనతో అందరికీ గుర్తుండిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అర్జెంటీనా జట్టుపై, ముఖ్యంగా మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలీక్(Abdul Khaleque) మెస్సీ గురించి చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుట్‍బాల్ లెజెండ్ మెస్సీ గురించి పొంతనలేని ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.
"అసోంతో మీకు సంబంధం ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం. ఇందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా" అంటూ అసోంలో కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలీక్ ట్వీట్ చేశారు. దీంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయిన నెటిజన్లు ఏంటి నిజమేనా? అంటూ శోధన మొదలుపెట్టారు. అప్పటికీ ఓ నెటిజన్ అయితే అసోంతో మెస్సీకి కనెక్షన్ ఏంటని ఎంపీని ప్రశ్నించాడు. ఇందుకు ఆయన ప్రతిస్పందిస్తూ.. "అవును మెస్సీ అసోంలోనే పట్టాడు" అంటూ మరో ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌లు కొన్ని క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఎంపీ చేసిన ట్వీట్లు నిజమేనా అంటూ నెటిజన్లు ఫ్యాక్ట్ చేసుకుని అది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. అంతటితో ఆగకుండా ఆయనను ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఎంపీ అజ్ఞానాన్ని ఏకీపారెస్తూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు. "బీకామ్‌లో ఫిజిక్స్ ఉన్నట్లే.. మెస్సీ కూడా అసోంలో పుట్టి ఉంటాడు" అని కామెంట్లు పెట్టారు. దీంతో తన తప్పును తెలుసుకున్న సదరు ఎంపీ తన ట్వీట్లను తొలగించారు. అసోంలోని బార్ పేట్ లోక్‌సభ్ స్థానానికి అబ్దుల్ ఖాలీక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో అర్జెంటీనా 3-3(4-2 తేడాతో) విజయం సాధించింది. నిర్దేశిత సమయంతో పాటు అదనపు సమయంలోనూ స్కోర్లు సమం కావడంతో ఫెనాల్టీ షూటౌట్లు నిర్వహించారు. ఇందులో అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శనతో నాలుగు గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. మెస్సీ ఫెనాల్టీతో కలిపి మూడు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ కోసం ఇంతకాలం తను కన్న కల నెరవేరినందుకు ఆనందోత్సాహంలో మునిగి తేలాడు. ఫలితంగా అర్జెంటీనా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. గతంలో 1978, 1986లో ప్రపంచకప్ సొంతం చేసుకున్న ఈ జట్టు.. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు జగజ్జేతగా నిలిచింది.