Bangladesh vs England: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. చివరి వన్డేలో ఘన విజయం
06 March 2023, 20:38 IST
- Bangladesh vs England: ఇంగ్లండ్‌కు షాకిచ్చింది బంగ్లాదేశ్. చివరి వన్డేలో ఘన విజయం సాధించింది. షకీబుల్ హసన్ ఆల్ రౌండ్ మెరుపులతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది.
ఇంగ్లండ్ ను 50 పరుగులతో చిత్తు చేసిన బంగ్లాదేశ్
Bangladesh vs England: ఏడేళ్ల తర్వాత స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్ టీమ్.. చివరి వన్డేలో మాత్రం ఇంగ్లండ్ కు షాకిచ్చింది. సోమవారం (మార్చి 6) జరిగిన మూడో వన్డేలో 50 పరుగులు తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ అటు బ్యాట్ తో ఇటు బాల్ తో మెరుపులు మెరిపించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 246 పరుగులు చేసింది. షకీబుల్ హసన్ 71 బంతుల్లో 75 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ ముష్ఫికర రహీమ్ (70), నజ్మల్ షాంటో (53) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో 48.5 ఓవర్లలో 246 పరుగులకు బంగ్లా ఆలౌటైంది. అయితే తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది.
షకీబుల్ హసన్ బౌలింగ్ లోనూ రాణించాడు. అతడు 4 వికెట్లు తీయగా.. తైజుల్ ఇస్లామ్, ఇబాదత్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ముస్తఫిజుర్ రెహమాన్, మెహదీ హసన్ మిరాజ్ చెరొక వికెట్ తీశారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను ఇంగ్లండ్ గెలవగా.. తాజా విజయంతో బంగ్లాదేశ్ ఆ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఆల్ రౌండ్ మెరుపులతో విజయంలో కీలకపాత్ర పోషించిన షకీబ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
వన్డేల్లో షకీబ్ 52వ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ముష్ఫికర్ రహీమ్, షాంటో టీమ్ ను ఆదుకున్నారు. ఇద్దరూ మూడో వికెట్ కు 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన షకీబ్ కూడా చెలరేగాడు. ఈ ముగ్గురూ రాణించడంతో బంగ్లాదేశ్ ఫైటింగ్ స్కోరు సాధించింది.
చేజింగ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలయ్యారు. జేమ్స్ విన్స్ 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ 35, క్రిస్ వోక్స్ 34 పరుగులు చేశారు. స్టార్ బ్యాటర్లు డేవిడ్ మలన్ (0), కెప్టెన్ జోస్ బట్లర్ (26) విఫలమయ్యారు.