Shakib Al Hasan on BPL: నాయక్ సినిమాలోలాగా ఒక్క రోజులో ఆ పని చేస్తా: బంగ్లా ప్లేయర్ షకీబ్
Shakib Al Hasan on BPL: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ నోట బాలీవుడ్ సినిమా నాయక్ పేరు వినిపించడం విశేషం. ఆ సినిమాలో చూపించినట్లు ఒక్క రోజులో ఏదైనా చేయొచ్చని అతడు అన్నాడు.
Shakib Al Hasan on BPL: రెండున్నర దశాబ్దాల కిందట మొదట తమిళం, తెలుగులో వచ్చిన సినిమా ఒకే ఒక్కడు (ముదల్వన్). శంకర్ డైరెక్షన్‌లో అర్జున్ నటించిన ఈ మూవీ ఓ సంచలనం. ఒక్క రోజు సీఎం అనే వెరైటీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో నాయక్‌గా రీమేక్ అయింది. ఇప్పుడీ సినిమా పేరు బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ షకీబుల్ హసన్ నోట వినిపించడం విశేషం.
శుక్రవారం (జనవరి 6) నుంచి ప్రారంభం కాబోతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ను అక్కడి క్రికెట్ బోర్డు సరిగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో షకీబ్ ఇలా స్పందించాడు. తనను ఈ లీగ్‌కు సీఈవోను చేస్తూ మార్పు తీసుకొస్తానని చెప్పాడు.
"ఒకవేళ వాళ్లు నన్ను బీపీఎల్ సీఈవోను చేస్తే.. ఒకటి లేదా రెండు నెలల్లో మొత్తం సరిచేస్తా. మీరు నాయక్ సినిమా చూసే ఉంటారు కదా? ఏదైనా చేయాలనుకుంటే ఒక్క రోజులో కూడా చేయొచ్చు" అని షకీబ్ అనడం విశేషం. "ప్లేయర్స్ డ్రాఫ్ట్, వేలం సరైన సమయంలో చేస్తా. బీపీఎల్‌ను ఖాళీ సమయాల్లో నిర్వహిస్తా. మన దగ్గర ఆధునిక టెక్నాలజీలు ఉన్నాయి" అని షకీబ్ చెప్పాడు.
2012లో ఆరు టీమ్స్‌తో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ లీగ్‌లో మరో టీమ్ వచ్చి చేరింది. ఈసారి లీగ్ కోసం ప్లేయర్స్ డ్రాఫ్ట్‌ను ఆలస్యం చేయడంపై షకీబ్ మండిపడ్డాడు. బీపీఎల్ కంటే కూడా బంగ్లాలోని దేశవాళీ 50 ఓవర్ల టోర్నీ ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) మెరుగ్గా నిర్వహిస్తున్నారని అన్నాడు. జనవరి 6 నుంచి 16 వరకూ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జరగనుంది.
ఈ లీగ్‌ను విజయవంతం చేయాలన్న ఉద్దేశం క్రికెట్ బోర్డుకు ఉన్నట్లు కనిపించడం లేదని షకీబ్ అన్నాడు. ఎప్పుడూ ఈ లీగ్‌ను సక్సెస్ చేయడానికి నిజాయతీగా ప్రయత్నించలేదని ఆరోపించాడు. అసలు ఇప్పుడు బీపీఎల్‌లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని, మ్యాచ్‌లు ప్రారంభమైనప్పుడే అది స్టార్ట్ అయినట్లుగా పరిస్థితి ఉందని, అంతకుముందు వరకూ ఎవరికి వారు ప్రాక్టీస్ చేసుకుంటున్నారని షకీబ్ అన్నాడు.
టాపిక్