Bairstow out or not out: బెయిర్‌స్టో ఔటా కాదా.. యాషెస్‌లో రచ్చ రేపుతున్న మరో వివాదం
03 July 2023, 13:54 IST
- Bairstow out or not out: బెయిర్‌స్టో ఔటా కాదా? యాషెస్‌లో రచ్చ రేపుతోంది మరో వివాదం. మ్యాచ్ ను మలుపు తిప్పిన వికెట్ కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
కేరీ స్టంపౌట్ తర్వాత షాక్ లో జానీ బెయిర్‌స్టో
Bairstow out or not out: యాసెష్ సిరీస్ లో ఆస్ట్రేలియా వరుసగా రెండో టెస్టు కూడా గెలిచింది. స్వదేశంలో బజ్‌బాల్ స్టైల్ నమ్ముకొని ఆస్ట్రేలియాను కంగారు పెడదామనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగడం లేదు. రెండో టెస్టులోనూ 43 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్.. సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించింది. అయితే ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔటైన విధానం వివాదానికి కారణమైంది.
బెయిర్‌స్టో ఎలా ఔటయ్యాడు?
ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్‌స్టోను వికెట్ కీపర్ అలెక్స్ కేరీ స్టంపౌట్ చేశాడు. అదీ ఎవరూ ఊహించని రీతిలో కావడం విశేషం. ఓవర్లో చివరి బంతి షార్ట్ పిచ్ బాల్ కావడంతో బెయిర్‌స్టో కాస్త వంగి బంతిని వదిలేశాడు. ఓవర్ ముగిసిపోయింది కదా అని క్రీజు నుంచి బయటకు వచ్చేశాడు.
ఈలోపు కేరీ బంతి అందుకొని వెంటనే విసరేయడంతో అది వికెట్లకు తగిలింది. రీప్లేలు గమనించిన థర్డ్ అంపైర్ ఔట గా ప్రకటించాడు. అది చూసి ఇంగ్లిష్ క్యాంప్ దిమ్మదిరిగిపోయింది. ఓవర్ అయిపోయిన తర్వాత బంతి డెడ్ అవుతుంది కదా.. దానికి ఎలా ఔటిస్తారు అన్నది ఇంగ్లండ్ జట్టుతోపాటు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కానీ అసలు క్రికెట్ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం.
బెయిర్‌స్టో నిర్లక్ష్యమే..
ఎంసీసీ నిబంధనల్లోని 20.1.1.1 ప్రకారం.. ఓ బాల్ వికెట్ కీపర్ లేదా బౌలర్ చేతుల్లోనే ఉండిపోతే డెడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కేరీ మాత్రం బంతి అందుకున్న వెంటనే విసిరేశాడు. దీంతో అది డెబ్ బాల్ కాదు. ఇక్కడ బెయిర్‌స్టో నిర్లక్ష్యమే అతని కొంప ముంచింది.
ఓవర్లో చివరి బంతి అయినా సరే.. వెనుక ఉన్న వికెట్ కీపర్ చేతుల్లోనే బంతి ఉందా లేదా చూసి క్రీజు వదలాలి. కానీ ఇక్కడ అతడు మాత్రం వెనక్కి చూడకుండా ముందుకు వచ్చేశాడు. అది డెబ్ బాలా కాదా అన్నదానిపై తుది నిర్ణయం అంపైర్ దే. అది డెడ్ బాల్ కాదని అంపైర్ తేల్చుకొని బెయిర్‌స్టోను ఔటిచ్చాడు.
కీలకమైన సమయంలో బెయిర్‌స్టో ఔటవడం ఇంగ్లండ్ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 155 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. 327 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్.. 43 పరుగులతో ఓడింది.