Ashes Series: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ చిత్తు.. స్టోక్స్ అద్భుత పోరాటం వృథా
02 July 2023, 21:49 IST
- Ashes Series: యాషెస్ సిరీస్ రెండో టెస్టులోనూ ఇంగ్లండ్‍ను చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుత సెంచరీ చేసినా.. తన టీమ్‍ను పరాజయం నుంచి తప్పించలేకపోయాడు.
ఔటయ్యాక నిరాశగా పెవిలియన్ చేరుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్
Ashes Series - Australia vs England : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‍లో ఆస్ట్రేలియా మరోసారి అదరగొట్టింది. ఆతిథ్య ఇంగ్లండ్‍ను రెండో టెస్టులోనూ చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్‍లో 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఈ రెండో టెస్టు ఐదో రోజైన నేడు (జూలై 2) ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155 పరుగులు) అద్భుతమైన శతకంతో పోరాడాడు. అయినా ఇంగ్లిష్ జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఐదో రోజైన నేడు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. 371 పరుగుల కఠిన లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జాష్ హాజిల్‍వుడ్ చెరో మూడు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ జట్టును కూల్చారు. గ్రీన్‍కు ఓ వికెట్ దక్కింది. వివరాలివే..
మ్యాచ్ ఐదో రోజైన నేడు 4 వికెట్లకు 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగించింది. బెన్ స్టోక్స్, బెన్ డకెట్ (83) బ్యాటింగ్ కంటిన్యూ చేశారు. తొలి సెషన్‍లో కాసేపు ఇద్దరు బ్యాటర్లు రాణించారు. అయితే, డకెట్‍ను హాజిల్‍వుడ్ ఔట్ చేయటంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. జానీ బెయిర్ స్టో (10) కాసేపటికే గ్రీన్ బౌలింగ్‍లో ఔటవటంతో ఇంగ్లిష్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ ఎదురుదాడి చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో ఆస్ట్రేలియాను భయటపెట్టాడు.
ఈ క్రమంలో 142 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు బెన్ స్టోక్స్. ఆ తర్వాత కూడా దాడి కొనసాగించాడు. దీంతో ఓ దశలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. 197 బంతుల్లోనే 150 పరుగుల మార్కును స్టోక్స్ చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆసీస్ బౌలర్ హేజిల్‍వుడ్ బౌలింగ్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు స్టోక్స్. దీంతో ఇంగ్లండ్ ఆశలు నీరుగారిపోయాయి. ఆ తర్వాత స్టువర్ బ్రాడ్ (11), ఓలీ రాబిన్‍సన్ (1) త్వరగా ఔటవటంతో ఇంగ్లండ్ ఆలౌటై.. పరాజయం పాలైంది.
లండన్‍లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఈ యాషెస్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ శకతంతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 279 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూల్చింది. అయితే, 371 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది.