Ashes Test - Video: పిచ్‍ వైపు దూసుకొచ్చిన ఆందోళనకారులు.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌లా బెయిర్‌స్టో.. ఏం చేశాడంటే!-protesters invade pitch at lords during ashes second test jonny bairstow carries protester ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashes Test - Video: పిచ్‍ వైపు దూసుకొచ్చిన ఆందోళనకారులు.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌లా బెయిర్‌స్టో.. ఏం చేశాడంటే!

Ashes Test - Video: పిచ్‍ వైపు దూసుకొచ్చిన ఆందోళనకారులు.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌లా బెయిర్‌స్టో.. ఏం చేశాడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 28, 2023 04:57 PM IST

Ashes Test - Video: లార్డ్స్ వేదికగా మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్టులో కాసేపు కలకలం రేగింది. ఇద్దరు ఆందోళనకారులు మైదానంలోకి దూసుకొచ్చారు.

ఆందోళనకారుడిని ఎత్తుకొని వెళుతున్న బెయిర్‌స్టో
ఆందోళనకారుడిని ఎత్తుకొని వెళుతున్న బెయిర్‌స్టో (Reuters)

Ashes Test - Video: యాషెస్ సిరీస్‍లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేడు (జూన్ 28) మొదలైంది. ఇంగ్లండ్‍లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. యాషెస్ సిరీస్‍లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఉత్కంఠ పోరులో విజయం సాధించగా.. ఈ రెండో మ్యాచ్ ఇంగ్లండ్‍కు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన ఇంగ్లిష్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. అయితే, తొలి ఓవర్‌లోనే గందరగోళం చెలరేగింది. ఇద్దరు ఆందోళనకారులు సెక్యూరిటీని దాటుకొచ్చి మైదానంలోకి దూసుకొచ్చారు.

ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ తొలి ఓవర్ వేయగా.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎదుర్కొన్నాడు. అయితే, తొలి ఓవర్ ముగియగానే స్టాండ్స్‌లో నుంచి ఇద్దరు ఆందోళనకారులు గ్రౌండ్‍లోకి వచ్చి.. పిచ్‍ వైపునకు దూసుకొచ్చారు. వారిద్దరు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ ఉద్యమానికి చెందిన ఆందోళనకారులు. ఒక్కసారిగా సెక్యూరిటీని దాటుకొచ్చి మైదానంలోకి వచ్చారు. పిచ్‍వైపుగా పరుగెత్తారు. గ్రౌండ్‍లో ఆరెంజ్ పవర్ పౌడర్ పెయింట్ వెదజల్లారు. దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. అయితే, ఆ సమయంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో చేసిన పని అందరినీ ఆకట్టుకుంది.

ఇద్దరు ఆందోళనకారులు మైదానంలో రాగా.. ఒక ఆందోళకారుడి జానీ బెయిర్‌స్టో తన చేతులతో ఎత్తుకున్నాడు. ఆ ఆందోళకారుడిని ఏకంగా బౌండరీ లైన్ అవతలి వరకు మోసుకెళ్లాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెయిర్‌స్టో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్‌లా మారిపోయాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

స్టోక్స్.. ఆ వ్యక్తిని ఎత్తుకొని వెళుతున్న వీడియోకు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ కూడా స్పందించాడు. “రెండో టెస్టుకు మంచి ఆరంభం. బెయిర్‌స్టో ఇప్పటికే హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేశాడు” అంటూ నవ్వుతున్న రెండు ఎమోజీలను పోస్ట్ చేశాడు అశ్విన్.

కాగా, రెండో టెస్టుకు తొలి రోజే కాసేపు వర్షం కూడా ఆటంకం కలిగించింది. అయితే, ఆట మళ్లీ మొదలైంది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్లు ఏమీ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 20 పరుగులు నాటౌట్), ఉస్మాన్ ఖవాజా (39 బంతుల్లో 6 పరుగులు నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

కాగా, చమురు వాడకాన్ని తగ్గించి.. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి కోసం వనరులను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లండ్‍లో కొందరు జస్ట్ స్టాప్ ఆయిల్ ఉద్యమాన్ని చేస్తున్నారు.

Whats_app_banner