తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australia Pm Vs England Pm: బెయిర్‌స్టో ఔట్ వివాదంపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్రధానుల ఫైట్

Australia PM vs England PM: బెయిర్‌స్టో ఔట్ వివాదంపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్రధానుల ఫైట్

Hari Prasad S HT Telugu

04 July 2023, 15:52 IST

google News
    • Australia PM vs England PM: బెయిర్‌స్టో ఔట్ వివాదం కాస్తా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్రధానుల ఫైట్ కు దారి తీసింది. మొదట బ్రిటన్ పీఎం రిషి సునాక్ దీనిపై స్పందించగా.. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

Australia PM vs England PM: యాషెస్ సిరీస్ అంటే అంతే మరి. క్రికెట్ అంటే పడి చచ్చే రెండు దేశాల మధ్య మ్యాచ్ ను ఆ దేశాల ప్రధానులు కూడా ఎంత సీరియస్ గా తీసుకుంటారో తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టు చూస్తే తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔటైన తీరుపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలుసు కదా.

ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ తీరు సరిగా లేదని, ఆ గెలుపు ఓ గెలుపు కాదన్నట్లుగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేసిన కామెంట్స్ ను ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్ సమర్థించారు. ఆస్ట్రేలియా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదని రిషి భావించినట్లుగా ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే తాజాగా మంగళవారం (జులై 4) దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ పరోక్షంగా స్పందించారు.

ఆస్ట్రేలియా పురుషుల, మహిళల జట్లను చూసి తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. "యాషెస్ లో తమ తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన ఆస్ట్రేలియా పురుషుల, మహిళల జట్లను చూసి గర్వపడుతున్నాను. ఎప్పుడూ గెలుస్తూనే ఉండే ఆ పాత ఆసీసే వీళ్లు కూడా. ఆస్ట్రేలియా మొత్తం అలిస్సా హీలీ, ప్యాట్ కమిన్స్ వెంటే ఉంది. వాళ్లకు ఘన స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నాం" అని ఆల్బనీస్ ట్వీట్ చేశారు.

రెండో టెస్ట్ జరిగిన లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ పై మోసగాళ్లు అంటూ పలువురు ఎంసీసీ సభ్యులు నోరు పారేసుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎంసీసీ ముగ్గురిని సస్పెండ్ కూడా చేసింది.

బెయిర్‌స్టో ఔట్ వివాదం ఏంటి?

ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్‌స్టోను వికెట్ కీపర్ అలెక్స్ కేరీ స్టంపౌట్ చేశాడు. అదీ ఎవరూ ఊహించని రీతిలో కావడం విశేషం. ఓవర్లో చివరి బంతి షార్ట్ పిచ్ బాల్ కావడంతో బెయిర్‌స్టో కాస్త వంగి బంతిని వదిలేశాడు. ఓవర్ ముగిసిపోయింది కదా అని క్రీజు నుంచి బయటకు వచ్చేశాడు.

ఈలోపు కేరీ బంతి అందుకొని వెంటనే విసరేయడంతో అది వికెట్లకు తగిలింది. రీప్లేలు గమనించిన థర్డ్ అంపైర్ ఔట గా ప్రకటించాడు. అది చూసి ఇంగ్లిష్ క్యాంప్ దిమ్మదిరిగిపోయింది. ఓవర్ అయిపోయిన తర్వాత బంతి డెడ్ అవుతుంది కదా.. దానికి ఎలా ఔటిస్తారు అన్నది ఇంగ్లండ్ జట్టుతోపాటు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

తదుపరి వ్యాసం