England PM: ఇది కరెక్ట్ కాదు.. ఆస్ట్రేలియా టీమ్‌పై బ్రిటన్ ప్రధాని రిషి అసహనం
England PM: ఇది కరెక్ట్ కాదు అంటూ ఆస్ట్రేలియా టీమ్‌పై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్‌స్టో ఔటైన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
England PM: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండో యాషెస్ టెస్టుపై సాక్షాత్తూ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ స్పందించడం గమనార్హం. ఆస్ట్రేలియా ఆడిన విధానంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో కీలకమైన సమయంలో బెయిర్‌స్టో ఔటవడంతో ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
నిబంధనల ప్రకారం.. ఇది ఔటే అయినా.. ఆస్ట్రేలియా టీమ్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఇది సరి కాదంటూ ఒకప్పుడు ఇయాన్ బెల్ విషయంలో ధోనీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తిని గుర్తు చేయడం విశేషం. తాజాగా ఇంగ్లిష్ పీఎం రిషి సునాక్ కూడా ఈ వివాదంపై స్పందించారు.
క్రికెట్ ను అమితంగా ఇష్టపడే ఆయన.. బెయిర్‌స్టో విషయంలో ఆస్ట్రేలియా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినట్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బెన్ స్టోక్స్ వ్యాఖ్యలతో సునాక్ పూర్తిగా ఏకీభవించినట్లు ఆయన తరుఫు అధికార ప్రతినిధి వెల్లడించారు. "బెన్ స్టోక్స్ తో ప్రధానమంత్రి ఏకీభవించారు. ఆస్ట్రేలియా గెలిచినట్లుగా తానెప్పుడూ గెలవాలని అనుకోనని ప్రధాని అన్నారు" అని అధికార ప్రతినిధి చెప్పారు.
ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ కూడా ఇవే కామెంట్స్ చేశాడు. ఇప్పటికే యాషెస్ సిరీస్ లో రెండు టెస్టులు ఓడినా.. ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంటుందన్న నమ్మకాన్ని రిషి సునాక్ వ్యక్తం చేశారు. ఇక లార్డ్స్ స్టేడియంలోని లాంగ్ రూమ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలతో ఎంసీసీ సభ్యులు వ్యవహరించిన తీరుపైనా రిషి సునాక్ స్పందించారు.
అలా వ్యవహరించిన సభ్యులపై ఎంసీసీ వేటు వేయడాన్ని రిషి సునాక్ సమర్థించినట్లు ఆయన అధికార ప్రతినిధి చెప్పారు. ఆ ఇద్దరు ప్లేయర్స్ పై నోరు పారేసుకున్న ముగ్గురు సభ్యులను ఎంసీసీ సస్పెండ్ చేసింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో యాషెస్ టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది.
సంబంధిత కథనం