MS Dhoni: దటీజ్ ధోనీ.. ఇప్పుడు బెయిర్‌స్టోలాగే అప్పుడు బెల్ రనౌట్.. కానీ మిస్టర్ కూల్ ఏం చేశాడో చూడండి
MS Dhoni: దటీజ్ ధోనీ.. ఇప్పుడు బెయిర్‌స్టోలాగే అప్పుడు బెల్ రనౌట్ అయ్యాడు. కానీ మిస్టర్ కూల్ మాత్రం తమ అప్పీల్ ను ఉపసంహరించుకొని తిరిగి బెల్ ను బ్యాటింగ్ కు అనుమతించాడు.
MS Dhoni: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔటైన విధానంపై క్రికెట్ ప్రపంచంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అది ఔట్ అని కొందరు, కాదని మరికొందరు వాదించుకుంటున్నారు. అతన్ని ఔట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు లార్డ్స్ మైదానంలో అవమానం కూడా ఎదుర్కొంది. చీటర్స్ అంటూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ వాళ్లను వెక్కిరించారు.
కానీ క్రికెట్ రూల్స్ ప్రకారం బెయిర్‌స్టో ఔటే. అయితే ఒకప్పుడు ఇదే ఇంగ్లండ్ టీమ్ బ్యాటర్ ఇయాన్ బెల్ కూడా ఇండియాతో మ్యాచ్ లో ఇలాగే రనౌటయ్యాడు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న ధోనీ మాత్రం అంపైర్ ఔటిచ్చినా సరే తమ అప్పీల్ ను ఉపసంహరించుకొని బెల్ ను మళ్లీ బ్యాటింగ్ కు రమ్మని ఆహ్వానించాడు. బెయిర్‌స్టో ఘటన నేపథ్యంలో మిస్టర్ కూల్ అప్పుడు చేసిన పనిని గుర్తు చేసుకుంటూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేస్తున్నారు.
2011లో ఏం జరిగిందంటే?
2011లో ఇండియా, ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్ లో జరిగింది. రెండో ఇన్నింగ్స్ లో రోజు ముగిసే చివరి బంతికి జరిగిన ఘటన చాలా మందిని షాక్ కు గురి చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్.. ఇషాంత్ బౌలింగ్ లో లెగ్ సైడ్ ఆడాడు. ఆ బంతిని బౌండరీ దగ్గర ప్రవీణ్ కుమార్ ఆపాడు. అయితే అది బౌండరీ అనుకున్న నాన్ స్ట్రైకర్ ఇయాన్ బెల్.. రోజు ముగిసిందనుకొని క్రీజు వదిలి బయటకు వెళ్లాడు.
అయితే బౌండరీ దగ్గర నుంచి ప్రవీణ్ బంతి విసరడం.. దానిని అందుకున్న ఫీల్డర్ వికెట్లను గిరాటేసి అప్పీల్ చేయడంతో మూడో అంపైర్ దానిని ఔట్ గా ప్రకటించాడు. అది చూసి బెల్ షాక్ తిన్నాడు. అప్పటికి బంతి డెడ్ కాకపోవడంతో అది ఔటే అని అప్పటి కామెంటేటర్ మైఖేల్ హోల్డింగ్ అన్నాడు. అది ఫోర్ అని భావించిన బ్యాటర్.. క్రీజు వదిలి వచ్చినట్లున్నాడు మరో కామెంటేటర్ షేన్ వార్న్ అన్నాడు.
క్రికెట్ రూల్స్ ప్రకారం అది ఔటే. కానీ మరుసటి రోజు ఇయాన్ బెల్ బ్యాటింగ్ కు దిగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. టీమిండియా కెప్టెన్ ధోనీ తన అప్పీల్ వెనక్కి తీసుకోవడంతో అంపైర్లు అతన్ని బ్యాటింగ్ కు అనుమతిచ్చారు. ధోనీ క్రీడాస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియన్లు కూడా అలాగే చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సంబంధిత కథనం