తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australia Odi Team: మ్యాక్స్‌వెల్ వచ్చేశాడు.. ఇండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా బలమైన టీమ్

Australia ODI Team: మ్యాక్స్‌వెల్ వచ్చేశాడు.. ఇండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా బలమైన టీమ్

Hari Prasad S HT Telugu

23 February 2023, 9:24 IST

google News
    • Australia ODI Team: మ్యాక్స్‌వెల్ వచ్చేశాడు. ఇండియాతో వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా బలమైన టీమ్ ను ఎంపిక చేసింది. గురువారం (ఫిబ్రవరి 23) ఉదయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వన్డే టీమ్ ను అనౌన్స్ చేసింది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్
గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ (REUTERS)

గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్

Australia ODI Team: ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఇక ఎలాగూ అవకాశం ఆస్ట్రేలియాకు లేదు. ఇప్పుడు కనీసం వన్డే సిరీస్ అయినా గెలవాలన్న ఉద్దేశంతో బలమైన జట్టును ప్రకటించింది. ఈ టీమ్ లోకి గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, జై రిచర్డ్‌సన్ లాంటి వాళ్లు తిరిగొచ్చారు. ఈ ముగ్గురూ గాయాల నుంచి కోలుకొని మళ్లీ జట్టులో అడుగుపెడుతున్నారు.

16 మంది సభ్యులతో కూడా టీమ్ ను క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం (ఫిబ్రవరి 23) ఉదయం అనౌన్స్ చేసింది. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ మూడు వన్డేల సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మార్చి 17 నుంచి 22 వరకూ ఈ మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ లు ముంబై, విశాఖపట్నం, చెన్నైలలో జరుగుతాయి.

ఓ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో తన కాలు విరగ్గొట్టుకున్న మ్యాక్స్‌వెల్ గతేడాది నవంబర్ లో సర్జరీ చేయించుకున్నాడు. మొత్తానికి ఇప్పుడతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ వారమే విక్టోరియా టీమ్ తరఫున షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీ బరిలోకి దిగాడు. ఇక ఎడమ మడమ గాయానికి గురై సర్జరీ చేయించుకున్న మిచెల్ మార్ష్ కూడా ఇప్పుడు కోలుకొని మళ్లీ ఆస్ట్రేలియా టీమ్ లో అడుగుపెడుతున్నాడు.

అటు కాలి పిక్క గాయంతో కొంతకాలంగా దూరంగా ఉన్న రిచర్డ్‌సన్ కూడా మళ్లీ టీమ్ లోకి వచ్చాడు. ఈ ముగ్గురూ వన్డే టీమ్ లో చాలా ముఖ్యమైన సభ్యులని ఈ సందర్భంగా ఛీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అన్నాడు. రెండో టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయిన ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, ఆష్టన్ అగార్ లకు కూడా ఈ వన్డే జట్టులో చోటు దక్కింది.

ఈ ఏడాది ఇండియాలో ఆస్ట్రేలియా రెండు వన్డే సిరీస్ లు ఆడనుంది. ఇది మొదటిది కాగా.. సెప్టెంబర్ లో మరో సిరీస్ ఆడటానికి ఇండియా రానుంది. వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో ఈ మూడు వన్డేల సిరీస్ తమకు ఎంతో ముఖ్యమని బెయిలీ అన్నాడు.

ఆస్ట్రేలియా వన్డే టీమ్

ప్యాట కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగార్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

తదుపరి వ్యాసం