Telugu News  /  Sports  /  Maxwell On Suryakumar Yadav Says They Do Not Have Money To Buy Surya For Big Bash League
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav Twitter)

Maxwell on Suryakumar Yadav: సూర్యకుమార్‌ను కొనేంత డబ్బు మా దగ్గర లేదు: మ్యాక్స్‌వెల్‌

23 November 2022, 15:37 ISTHari Prasad S
23 November 2022, 15:37 IST

Maxwell on Suryakumar Yadav: సూర్యకుమార్‌ను కొనేంత డబ్బు మా దగ్గర లేదు అన్నాడు ఆస్ట్రేలియా బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. న్యూజిలాండ్‌పై అతని ఆట చూసి షాక్‌కు గురైన అతడు.. సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు.

Maxwell on Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో ప్రపంచమంతా అతని గురించే మాట్లాడుకుంటోంది. తన లైఫ్‌టైమ్‌ ఫామ్‌లో ఉన్న సూర్య టీ20ల్లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌ కూడా. ఈ మధ్యే ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో 189 స్ట్రైక్‌రేట్‌తో 239 రన్స్‌ చేసి టాప్‌ 3లో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒక సెంచరీతోపాటు మొత్తం 124 రన్స్‌ చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

రెండో టీ20లో అతడు కేవలం 51 బాల్స్‌లోనే 111 రన్స్‌ చేశాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన ఆస్ట్రేలియా ప్లేయర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సూర్యపై ప్రశంసలు కురిపించాడు. అతనిలాగా మరెవరూ ఆడలేరని అన్నాడు. "ఆరోజు మ్యాచ్ ఉన్నట్లు తెలియదు. కానీ తర్వాత స్కోరు కార్డు చూసి ఫించ్‌కు పంపించాను. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అతడు పూర్తిగా వేరే ప్లానెట్‌లో ఆడుతున్నట్లుగా అనిపించింది. మిగతా వాళ్ల స్కోర్లు చూడు అతని స్కోరు చూడు. అతడు కేవలం 51 బాల్స్‌లో 111 రన్స్‌ చేశాడు" అని మ్యాక్స్‌వెల్‌ అన్నాడు.

ఆ తర్వాత తాను మ్యాచ్‌ రీప్లేను పూర్తిగా చూసినట్లు వెల్లడించాడు. "ఆ వెంటనే నేను సూర్య ఇన్నింగ్స్‌ రీప్లే చూశాను. అందరి కంటే అతడు ఎంతో మెరుగ్గా ఆడాడు. అది చూడటం కష్టంగా అనిపించింది. ఎవరూ అతనిలా ఆడలేరు" అని మ్యాక్స్‌వెల్‌ స్పష్టం చేశాడు. మరి భవిష్యత్తులో సూర్యను బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిస్తారా అని సరదాగా అడగగా.. మ్యాక్సీ కూడా అలాగే స్పందించాడు.

"మా దగ్గర అంత డబ్బు లేదు. ఛాన్సే లేదు. ప్రతి ప్లేయర్‌ను, ప్రతి కాంట్రాక్ట్‌ ఉన్న ప్లేయర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా తొలగించాల్సి వస్తుంది" అని మ్యాక్స్‌వెల్‌ నవ్వుతూ అన్నాడు. టీ20ల్లో రెండో సెంచరీ చేసిన సూర్యకుమార్‌.. ఆ ఇన్నింగ్స్‌తో తన రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో శుక్రవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్‌కు సూర్య సిద్ధమవుతున్నాడు.

టాపిక్