India vs Australia 2023 Test Series: భారత్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ అవసరం లేదు.. డైరెక్టుగా బరిలోనే తేల్చుకుంటాం: ఆసీస్ కోచ్
01 January 2023, 19:33 IST
- India vs Australia 2023 Test Series: వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టుల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తాము ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే బరిలోకి దిగుతామని ఆసీస్ కోచ్ ఆండ్రూ స్పష్టం చేశారు.
భారత్-ఆస్ట్రేలియా
India vs Australia 2023 Test Series: వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఆసీస్.. భారత్‌లో పర్యటించనుంది. 2017 తర్వాత టెస్టు సిరీస్ కోసం కంగారూ జట్టులో మన దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. అప్పుడు భారత్ విజయాన్ని సాధించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఈ రెండు జట్లు తొలి రెండు స్థానాల్లో ఉండటంతో వచ్చే నెల నుంచి జరగనున్న ఈ సిరీస్ ఆసక్తికరంగా మారనుంది. అయితే భారత్‌ను ఎదుర్కొనేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డోనాల్డ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడకుండానే బరిలోకి దిగుతామని అన్నారు.
"గత కొన్ని సిరీస్‌లకు మేము ఎలాంటి టూర్ గేమ్(ప్రాక్టీస్ మ్యాచ్) ఆడకుండానే బరిలోకి దిగుతున్నాం. విదేశీ పర్యటనల్లోనూ ఇదే పద్ధతిని అవలంభిస్తున్నాం. మరి అంత ప్రాక్టీస్ మాకు అవసరం లేదని అనుకుంటున్నాం. తొలి టెస్టుకు ఓ వారం ముందు మాత్రమే భారత్‌కు బయల్దేరుతాం. ప్రిపరేషన్ పరంగా మేము ఎక్కువకాలం ఆటగాళ్లను ఒత్తిడి చేయదలచుకోలేదు" అని ఆసీస్ కోచ్ ఆండ్రూ అన్నారు.
మొత్తం నాలుగు టెస్టుల సిరీస్‌కు ఏడు రోజుల సమయం సరిపోతుందనే తాము అనుకుంటున్నామని ఆసీస్ కోచ్ ఆండ్రూ స్పష్టం చేశారు.
"మేము మా సొంత పరిస్థితుల్లో క్రియేటివ్‌గా ఉండగలము. పాకిస్థాన్‌తో సిరీస్‌లోనూ ఇదే చేశాం. లోకల్ గ్రౌండ్ మెన్ సాయంతో మేము కలిసి పనిచేసి ప్రాక్టీస్ గేమ్ లేకుండానే ఆడగలమని భావిస్తున్నాం." ఆయన అన్నారు.
గతేడాది పాకిస్థాన్ పర్యటనలోనూ ఆస్ట్రేలియా ఇదే ఫార్ములాతో వెళ్లి విజయం సాధించింది. పాక్‌పై 1-0 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు భారత్‌తోనూ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్లనుంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పుర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టు ప్రారంభం కానుంది. అనంతరం ఫిబ్రవరి 17న దిల్లీలో రెండో టెస్టు, మార్చి 1న ధర్మశాలలో మూడో టెస్టు, మార్చి 9న అహ్మదబాద్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. దీని తర్వాత మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది.