తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2023: పాకిస్థాన్‌లో ఆసియా కప్‌.. టీమ్‌ను పంపడానికి సిద్ధమంటున్న బీసీసీఐ

Asia Cup 2023: పాకిస్థాన్‌లో ఆసియా కప్‌.. టీమ్‌ను పంపడానికి సిద్ధమంటున్న బీసీసీఐ

Hari Prasad S HT Telugu

14 October 2022, 16:10 IST

google News
    • Asia Cup 2023: వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఆసియా కప్‌ జరగనుంది. అయితే ఆ దేశానికి టీమ్‌ను పంపించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే చాలు.. టీమ్‌ పాక్‌ వెళ్తుంది.
2023లో ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్
2023లో ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్ (REUTERS)

2023లో ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్

Asia Cup 2023: ఇండియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల కోసం కోట్ల మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అయితే రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా సంబంధాలు పూర్తిగా క్షీణించడంతో ఆ ప్రభావం క్రికెట్‌పై పడింది. ఈ రెండు దేశాల మధ్య పదేళ్లుగా అసలు క్రికెట్‌ సంబంధాలే లేవు. ఐసీసీ టోర్నీల్లో తప్ప ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడింది లేదు.

ఇండియన్ టీమ్‌ చివరిసారి 2005-06లో రాహుల్ ద్రవిడ్‌ కెప్టెన్సీలో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ టూర్‌లో ఇండియన్‌ టీమ్‌ మూడు టెస్టులు, 5 వన్డేలు ఆడింది. అప్పటి నుంచి ఇక మన టీమ్‌ పాక్‌లో అడుగుపెట్టలేదు. అయితే 2012-13లో పాక్‌ క్రికెట్‌ టీమ్‌ మాత్రం ఇండియాలో పర్యటించింది. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన చివరి ద్వైపాక్షిక సిరీస్‌ అదే.

పదేళ్లుగా ఈ రెండు టీమ్స్‌ ఐసీసీ టోర్నీల్లో తప్ప ప్రత్యేకంగా ఆడింది లేదు. ఇక ఇప్పుడు ఆసియా కప్‌ 2023కు పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తోంది. దీంతో ఈ టోర్నీలో పాల్గొనాలంటే ఇండియన్‌ టీమ్‌ కచ్చితంగా పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమ్‌ను పంపిస్తుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే తాజాగా తాము టీమ్‌ను పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ బోర్డు తెలిపింది.

అంతమాత్రాన ఇండియన్‌ టీమ్‌ వెళ్తుందని చెప్పలేము. దీనికి భారత ప్రభుత్వం కూడా అనుమతించాల్సి ఉంటుంది. ఒకవేళ బీసీసీఐ టీమ్‌ను పంపడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వం అనుమతించకపోతే టీమ్‌ పాకిస్థాన్ వెళ్లలేదు. ఈ నెల 18న బీసీసీఐ ఏజీఎం జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు బోర్డు లేఖలు రాసింది. అందులో పాక్‌ టూర్‌పై స్పష్టత ఇచ్చింది.

2023లో పాకిస్థాన్‌ 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగబోయే ఆసియా కప్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఇండియాలో వన్డే వరల్డ్‌కప్‌ జరుగుతుంది. ఆ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్‌ టీమ్‌ ఇండియా రావాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం