Asia Cup 2022: ఇండియా, పాకిస్థాన్‌లలో ఒకరిని ఆఫ్ఘనిస్థాన్ ఇంటికి పంపించేయగలదు: జడేజా
31 August 2022, 16:34 IST
- Asia Cup 2022: ఇండియా, పాకిస్థాన్‌లలో ఒకరిని ఇంటికి పంపించే సామర్థ్యం ఆఫ్ఘనిస్థాన్‌కు ఉందని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. ఆ టీమ్‌పై అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆసియా కప్ 2022లో చెలరేగుతున్న ఆఫ్ఘనిస్థాన్ టీమ్
Asia Cup 2022: ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్థాన్ సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ శ్రీలంక, బంగ్లాదేశ్‌లను చిత్తు చేసి సూపర్ ఫోర్‌కు చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. అసలు గ్రూప్ బి నుంచి ఆఫ్ఘన్ టీమ్ ముందుగా సూపర్ ఫోర్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆ టీమ్ అంచనాలకు మించిన ప్రదర్శన చేస్తోంది.
మహ్మద్ నబీ కెప్టెన్సీలోని ఆఫ్ఘనిస్థాన్ టీమ్ జెయింట్ కిల్లర్‌గా నిలుస్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను కూడా ఆ టీమ్ 7 వికెట్లతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. నజీబుల్లా జద్రాన్ కేవలం 17 బాల్స్‌లోనే 43 రన్స్ చేసి బంగ్లా ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్ తర్వాత క్రిక్‌బజ్‌తో మాట్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. ఆఫ్ఘన్ టీమ్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఈ సందర్భంగా ఇండియా, పాకిస్థాన్ టీమ్స్‌కు అతడు ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. బౌలింగే ఆఫ్ఘనిస్థాన్ ప్రధాన బలమని, అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ పవరేంటో కూడా ఆ టీమ్ చూపించిందని అన్నాడు. ఇది చూస్తుంటే ఇండియా లేదా పాకిస్థాన్‌లలో ఒక టీమ్‌ను ఇంటికి పంపించే సత్తా ఆఫ్ఘనిస్థాన్‌కు ఉన్నదని జడేజా అనడం గమనార్హం.
"ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎలా ఉందో మనకు తెలుసు. ఇండియా లేదా పాకిస్థాన్ టీమ్‌లలో ఒకదానిని తీసుకోండి. ఒకవేళ ఆ టీమ్స్ 20/2 లేదా 30/2కు పరిమితమయ్యాయంటే ఇక మ్యాచ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాన్ని వాటికి ఇవ్వదు. ఈ టీమ్‌కు ఆ సత్తా ఉంది. ఇక బ్యాటింగ్‌లో వాళ్ల ఓపెనర్లు ఎలా ఆడతారో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఇండియా లేదా పాకిస్థాన్ అనలిస్ట్‌లు ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ప్లాన్ చేస్తారు? ఆ ఓపెనర్లు మిమ్మల్ని ఆశ్చర్యపరచగలరు. మిగిలిన టీమ్ కూడా అంతే" అని జడేజా స్పష్టం చేశాడు.