Afg vs Ban: ఆఫ్ఘనిస్థాన్‌ సంచలనం.. బంగ్లాను చిత్తు చేసి సూపర్‌ ఫోర్‌లోకి..-afghanistan beat bangladesh to enter into super four of asia cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Afghanistan Beat Bangladesh To Enter Into Super Four Of Asia Cup 2022

Afg vs Ban: ఆఫ్ఘనిస్థాన్‌ సంచలనం.. బంగ్లాను చిత్తు చేసి సూపర్‌ ఫోర్‌లోకి..

Hari Prasad S HT Telugu
Aug 30, 2022 10:45 PM IST

Afg vs Ban: ఆఫ్ఘనిస్థాన్‌ సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఆసియా కప్‌ 2022లో సూపర్‌ ఫోర్‌లోకి అడుగు పెట్టిన తొలి టీమ్‌గా నిలిచింది.

ఆఫ్ఘనిస్థాన్ కు సంచలన విజయం అందించిన నజీబుల్లా, ఇబ్రహీం
ఆఫ్ఘనిస్థాన్ కు సంచలన విజయం అందించిన నజీబుల్లా, ఇబ్రహీం (AFP)

Afg vs Ban: ఆసియా కప్‌ 2022 సూపర్‌ ఫోర్‌లో అడుగుపెట్టిన తొలి టీమ్‌గా నిలిచింది ఆఫ్ఘనిస్థాన్‌. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు షాకిచ్చిన ఆ టీమ్‌.. మంగళవారం (ఆగస్ట్‌ 30) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సంచలన విజయం సాధించింది. అసలు ఆశలే లేని స్థితి నుంచి మరో 9 బాల్స్‌ మిగిలి ఉండగానే.. 128 రన్స్‌ టార్గెట్‌ను 3 వికెట్లు కోల్పోయి చేజ్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఆఫ్ఘన్‌ బ్యాటర్లు నజీబుల్లా, ఇబ్రహీం జద్రాన్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 36 బాల్స్‌లోనే అజేయంగా 69 రన్స్‌ జోడించడం విశేషం. సిక్సర్లతో విరుచుకుపడిన నజీబుల్లా కేవలం 17 బాల్స్‌లోనే 6 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 43 రన్స్‌ చేశాడు. అటు ఇబ్రహీం 41 బాల్స్‌లో 42 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు.

128 రన్స్‌ చేజింగ్‌లో ఒక దశలో 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 రన్స్‌ మాత్రమే చేసింది. ఈ దశలో బంగ్లాదేశ్‌ గెలవడం ఖాయంగా కనిపించింది. కానీ ఈ ఇద్దరూ మ్యాచ్‌ను మలుపు తిప్పారు. సిక్సర్లతో విరుచుకుపడిన నజీబుల్లా.. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ టీమ్‌ స్టార్‌ బౌలర్‌ ముస్తఫిజుర్‌ రెహమాన్‌ వేసిన 17వ ఓవర్లోనూ రెండు సిక్సర్లు బాదాడు.

రషీద్, ముజీబ్ సూపర్ బౌలింగ్

అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్‌.. బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌.. ఆఫ్ఘన్‌ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 రన్స్‌ మాత్రమే చేసింది. ఆఫ్ఘన్‌ బౌలర్లు ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. ముఖ్యంగా ముజీబ్‌ 4 ఓవర్లలో కేవలం 16 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం.

అటు రషీద్‌ కూడా 4 ఓవర్లలో 22 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక దశలో బంగ్లాదేశ్‌ 28 రన్స్‌ కే 4 వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మొసద్దక్‌ హుస్సేన్‌ మెరుపులతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా సాధించింది. హుస్సేన్‌ 31 బాల్స్‌లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 48 రన్స్‌ చేశాడు. ఇక మహ్మదుల్లా 25, మెహదీ హసన్ 14, అఫిఫ్‌ హుస్సేన్‌ 11 రన్స్‌ చేశారు.

సీనియర్లు అయిన కెప్టెన్‌ షకీబుల్ హసన్‌ (11), ముష్ఫికర్‌ రహీమ్‌ (1) విఫలమయ్యారు. ఆసియా కప్‌లో గ్రూప్‌ బిలో ఈ రెండు టీమ్స్‌ ఉన్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకను సులువుగా చిత్తు చేసి కాన్ఫిడెంట్‌గా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది. ఇందులో గెలిస్తే ఆ టీమ్‌ సూపర్‌ ఫోర్‌ చేరిన తొలి టీమ్ అవుతుంది.

WhatsApp channel