Ashwin: నువ్వు మామూలోడివి కాదు భయ్యా.. రివ్యూనే రివ్యూ చేసిన అశ్విన్
15 June 2023, 7:24 IST
- Ashwin: నువ్వు మామూలోడివి కాదు భయ్యా.. రివ్యూనే రివ్యూ చేశాడు అశ్విన్. ఈ వింత ఘటన తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో జరిగింది. అయితే అంత చేసినా అశ్విన్ కు అనుకున్న ఫలితం మాత్రం రాలేదు.
అంపైర్లతో అశ్విన్ వాగ్వాదం
Ashwin: ఈ వీడియోలో అశ్విన్ ను చూసిన తర్వాత నువ్వు మామూలోడివి కాదు భయ్యా అని అనాల్సి వస్తుందేమో. రివ్యూనే రివ్యూ చేశాడతడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా దిండిగుల్ డ్రాగన్స్, తిరుచ్చి మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ వింత ఘటన జరిగింది. మొదట బ్యాటర్ తీసుకున్న రివ్యూతో అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ రివర్స్ చేశాడు.
అయినా అశ్విన్ మళ్లీ రివ్యూ తీసుకున్నాడు. ఈసారి కూడా రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే అప్పటికే రివ్యూ చేసిన నిర్ణయాన్ని మరోసారి రివ్యూ చేయమని అశ్విన్ అడగడం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. బౌలింగ్ చేసే సమయంలో అశ్విన్ చాలా దూకుడుగా ఉంటాడు. తాను ఊహించిన ఫలితం రాకపోతే అంపైర్లతోనూ తరచూ వాగ్వాదానికి దిగుతుంటాడు.
ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ అదే చేశాడు. దిండిగుల్ కెప్టెన్ అయిన అశ్విన్ 13వ ఓవర్ వేశాడు. అతని బౌలింగ్ లో బ్యాటర్ రాజ్‌కుమార్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇవ్వడంతో అంపైర్ ఔటైనట్లు ప్రకటించాడు. అయితే రాజ్ కుమార్ దానిని వెంటనే రివ్యూ చేశాడు. రీప్లేల్లో బ్యాట్ గ్రౌండ్ కు తగిలినట్లు తేలింది. బంతి మాత్రం బ్యాట్ కు కాస్త దూరంగా వెళ్లడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
ఆన్ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న వెంటనే అశ్విన్ మరోసారి రివ్యూ కోరాడు. ఆ సమయంలో లెగ్ అంపైర్ వచ్చి అలా ఎలా కుదురుతుందని అడిగినా.. అశ్విన్ అతనితో వాదించి రివ్యూ తీసుకున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. ఈసారి కూడా అవే రిప్లేలను చూసి థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో అశ్విన్ నిరాశ చెందాడు.
బిగ్ స్క్రీన్ పై చూసిన తర్వాత అతడు ఔటైనట్లు తాను భావించానని మ్యాచ్ తర్వాత అశ్విన్ చెప్పాడు. ఆన్‌ఫీల్డ్ నిర్ణయాన్ని రివర్స్ చేయడానికి థర్డ్ అంపైర్ కు కచ్చితమైన ఆధారం కావాలని, ఆ వీడియోను మరో యాంగిల్లో చూసి నిర్ణయాన్ని ప్రకటిస్తాడన్న ఉద్దేశంతో మరోసారి రివ్యూ చేసినట్లు తెలిపాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కని అశ్విన్.. ఇండియాకు తిరిగి రాగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్ తో బిజీ అయ్యాడు.