TNPL: ఒక్క బంతికి 18 పరుగులు.. క్రికెట్‌లో సరికొత్త రికార్డు
TNPL: ఒక్క బంతికి 18 పరుగులు ఇచ్చాడు ఓ బౌలర్. క్రికెట్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ చెత్త రికార్డు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో నమోదు కావడం విశేషం.
TNPL: ఒక్క బంతికి 18 పరుగులు ఇవ్వడం అంటే మాటలు కాదు. అందులోనూ అది ఇన్నింగ్స్ చివరి బంతి అయితే.. ఆ బంతికే వికెట్ పడితే.. ఈ వింత రికార్డు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా నమోదవడం విశేషం. చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టన్స్ మధ్య మ్యాచ్ లో ఈ వింత జరిగింది. అది కూడా స్పార్టన్స్ కెప్టెన్ అయిన అభిషేక్ తన్వర్ ఇలా ఒకే బంతికి 18 పరుగులు ఇచ్చాడు.
చెపాక్ సూపర్ గిల్లీస్ ఇన్నింగ్స్ చివరి బంతికే ఈ 18 పరుగులు వచ్చాయి. ఆ టీమ్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులతో ఉంది. చివరి బంతిని అభిషేక్ వేశాడు. బ్యాటర్ క్లీన్ బౌల్డ్ కావడంతో అభిషేక్ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే అది నోబాల్ అని తేలడంతో అసలు కథ అప్పుడు మొదలైంది.
చివరి బంతికి 18 పరుగులు ఇలా..
- 20వ ఓవర్ చివరి బంతికి బ్యాటర్ బౌల్డ్ అయినా అది నోబాల్ అని తేలడంతో ఒక పరుగు వచ్చింది
- తర్వాత బంతి కూడా నోబాల్ కాగా బ్యాటర్ సిక్స్ కొట్టాడు. దీంతో 8 పరుగులు అయ్యాయి.
- ఆ తర్వాతి బంతి కూడా నోబాల్ వేశాడు అభిషేక్. ఈ బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి.
- ఈసారైనా ఇన్నింగ్స్ ఫినిష్ చేస్తాడనుకుంటే అభిషేక్ వైడ్ వేశాడు. ఆ బంతికి 12 పరుగులు అయ్యాయి.
- చివరాఖరికి నోబాల్, వైడ్ కాకుండా ఓ లీగల్ డెలివరీ వేశాడు. అయితే అది కాస్తా సిక్స్ వెళ్లింది. దీంతో చివరి బంతికి మొత్తం 18 పరుగులు వచ్చినట్లయింది.
ఇక 20వ ఓవర్లో మొత్తంగా 26 పరుగులు ఇచ్చాడు అభిషేక్. దీంతో 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులుగా ఉన్న చెపాక్ టీమ్ స్కోరు.. 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లకు 21 పరుగులకు చేరింది. తన ఈ బౌలింగ్ ప్రదర్శనపై అభిషేక్ కూడా అసంత్రుప్తి వ్యక్తం చేశాడు.
"చివరి ఓవర్ కు పూర్తి బాధ్యత నాదే. ఓ సీనియర్ బౌలర్ గా నాలుగు నోబాల్స్ వేయడం నిరాశ కలిగించింది. గాలి కూడా దీనికి కారణమైంది" అని మ్యాచ్ తర్వాత స్పార్టన్స్ కెప్టెన్ అభిషేక్ అన్నాడు. ఈ మ్యాచ్ లో స్పార్టన్స్ 52 పరుగుల తేడాతో ఓడిపోయారు.
సంబంధిత కథనం