Argentina Team Airlifted: ఇసుకేస్తే రాలనంత జనం.. బస్సు కదలక హెలికాప్టర్లలో అర్జెంటీనా ప్లేయర్స్ తరలింపు
21 December 2022, 15:07 IST
- Argentina Team Airlifted: ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ఓపెన్ టాప్ బస్సు కదల్లేకపోయింది. ఏకంగా 40 లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. దీంతో వరల్డ్ ఛాంపియన్స్ అర్జెంటీనా టీమ్‌ను హెలికాప్టర్లలో తరలించాల్సి వచ్చింది.
అర్జెంటీనా ప్లేయర్స్ ను చూడటానికి పోటెత్తిన అభిమానులు
Argentina Team Airlifted: అర్జెంటీనా టీమ్ ఒకటీ రెండేళ్లు కాదు ఏకంగా 36 ఏళ్ల తర్వాత మరోసారి ఫిఫా వరల్డ్‌కప్ గెలిచింది. ఈ విజయం మెస్సీనే కాదు అర్జెంటీనా దేశం మొత్తాన్నీ ఆనందంతో ఊపేస్తోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి లక్షల సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ఓపెన్ టాప్ బస్‌లో తాము సాధించిన వరల్డ్‌కప్ ట్రోఫీతో సగర్వంగా ఊరేగుతున్న టీమ్ సభ్యులను చూడటానికి ఎగబడ్డారు.
ఎంతలా అంటే.. రోడ్డుపై ఇసుకేస్తే రాలనంత జనం. ఎటు చూసినా జన సముద్రమే. కనీసం ప్లేయర్స్ వెళ్తున్న బస్సు ముందుకు కదలడానికి కూడా వీల్లేకుండా పోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓపెన్ టాప్ బస్ పరేడ్‌ను నిలిపేసి.. ప్లేయర్స్‌ను హెలికాప్టర్లలో తమ స్వస్థలాలకు పంపించాల్సి వచ్చింది. ఆదివారం (డిసెంబర్ 18) జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను మట్టి కరిపించి టైటిల్ గెలిచిన అర్జెంటీనా మంగళవారం (డిసెంబర్ 20) స్వదేశానికి వచ్చింది.
తమ హీరోలను చూడటానికి అభిమానులు పోటెత్తారు. కాసేపు బాగానే కదిలిన ఓపెన్ టాప్ బస్సు.. క్రమంగా ముందుకు సాగడం అసాధ్యంగా మారిపోయింది. ఏకంగా 40 లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. దీంతో పరేడ్‌ను గమ్యం చేరక ముందే నిలిపేశారు. బ్యూనస్ ఎయిర్స్ రోడ్లపై ఎటు చూసినా జనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
"చాలా క్రేజీగా ఉంది. ఇది అద్భుతం. మన జీవితంలో జరిగే అత్యుత్తమ క్షణాలివి. ఇంత మంది సంతోషంగా ఉన్న జనాలను చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉంది" అని ఓ 25 ఏళ్ల అభిమాని అన్నారు. ఓపెన్ టాప్ బస్ పరేడ్‌ను మధ్యలోనే నిలిపేయడంపై అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చికి టాపియా స్పందించారు. ఇంత మంది జనం మధ్య తమను సెక్యూరిటీ సిబ్బంది ముందుకు వెళ్లనీయలేదని చెప్పారు.
అందరినీ కలవలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. అర్జెంటీనా వరల్డ్‌కప్ గెలిచిన సందర్భాన్ని ఆస్వాదించడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి మంగళవారం దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించడం విశేషం. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై పెనాల్టీల్లో అర్జెంటీనా 4-2తో విజయం సాధించిన విషయం తెలిసిందే.