Argentina won FIFA World Cup 2022: విశ్వవిజేతగా అర్జెంటీనా.. ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కైవసం.. ఫ్రాన్స్‌పై అదిరే విజయం
Argentina won FIFA World Cup 2022: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా కప్పును సొంతం చేసుకుంది. అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోవడంతో ఫెనాల్టీ షూటౌట్ ఇచ్చారు. ఇందులో అర్జెంటీనా 4-2 తేడాతో విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది.
ఎట్టకేలకు మెస్సీ కల నెరవేరింది. తన సారథ్యంలో ఒక్కసారైనా తన జట్టుకు ప్రపంచకప్ అందించగలనా అనే అయోమయంలో పడిన అతడి స్వప్న సాకారమైంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ను అర్జెంటీనా సొంతం చేసుకుంది. ఆదివారం నాడు ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో మెస్సీ జట్టు గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ఫుట్‌బాల్ ప్రియలకు మంచి అనుభూతిని కలగజేసింది. చివరి వరకు దోబూచులాడిన విజయం.. ఎట్టకేలకు అర్జెంటీనానే వరించింది.
గోల్స్ సమం కావడంతో మ్యాచ్ నిర్ణీత సమయమే కాకుండా అదనపు సమయం ఇచ్చినప్పటికీ ఫలితం 3-3 గానే ఉండటంతో ఇరుజట్లు ఫెనాల్టీ అవకాశాలిచ్చారు. ఈ అవకాశాన్ని అర్జెంటీనా అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది. ఫలితంగా మూడో సారి విశ్వవిజేతగా నిలిచింది. 3-3(4-2) తేడాతో అర్జెంటీనా కప్పును సొంతం చేసుకుంది. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ఫెనాల్టీ ,కిక్స్‌లో అద్భుతంగా రెండు గోల్స్ ఆపి మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు.
ఆరంభ ఆధిపత్యం అర్జెంటీనాదే..
ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగింది. మ్యాచ్ ప్రారంభమైన 23వ నిమిషంలోనే ఫెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది అర్జెంటీనా. ఆ జట్టు స్టార్ మెస్సీ అద్భుతమైన షాట్‌తో గోల్ సాధించాడు. అనంతరం 36వ నిమిషంలో ఏంజెల్ డీ మానా మరో గోల్ సాధించడంతో మొదటి అర్ధభాగం ముగిసే సమయానికే 2-0తో అర్జెంటీనా లీడ్‌లో ఉంది.
దోబూచులాడిన విజయం..
అయితే అనూహ్యంగా ఆలస్యంగా పుంజుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్. సెకాండాఫ్ ముగిసే సమయంలో 80వ నిమిషంలో ఫెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఎంబాపే అద్భుత గోల్ చేశాడు. స్వల్ప వ్యవధిలోనే మరో అతడే మళ్లీ మరో గోల్ సాధించి స్కోర్లు 2-2తో సమం చేశాడు. దీంతో ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు అదనపు సమయం ఇచ్చారు. ఈ సమయంలో మెస్సీ 108 నిమిషంలో ఫెనాల్టీ అవకాశాన్ని వినియోగించుకుని అర్జెంటీనా ఖాతాలో మరో గోల్ వేశాడు.
ఇక ఆట మరో రెండు నిమిషాల్లో పూర్తవుతుందన్న తరుణంలో ఫెనాల్టీ అవకాశాన్ని ఉపోయోగించుకున్న ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే 118వ నిమిషంలో అద్భుత గోల్ సాధించాడు. దీంతో స్కోర్లు 3-3తో సమమయ్యాయి. మరో ఐదు నిమిషాలు అదనపు సమయం ఇచ్చిన ఫలితం లేకపోయింది. దీంతో ఫెనాల్టీ షూటౌట్లు నిర్వహించారు.
అర్జెంటీనా గోల్ కీపర్ అద్భుతం..
ఇలాంటి సమయంలో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్ అద్భుతమే చేశాడు. రెండు కీలక గోల్స్ ఆపి అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే తన తొలి ప్రయత్నంలోనే గోల్ సాధించగా.. అర్జెంటీనా తొలి ప్రయత్నంలో సునాయసంగా మెస్సీ గోల్ కొట్టాడు. రెండో ప్రయత్నంలో ఫ్రాన్స్ ఆటగాడు కొట్టిన గోల్‌ను అర్జెంటీనా గోల్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే ఈ సారి అర్జెంటీనా మాత్రం తన గోల్‌ను దిగ్విజయంగా పూర్తి చేసింది. దీంతో 2-1తో ఆధిక్యాన్ని సాధించింది. మూడో ప్రయత్నంలోనూ ఫ్రాన్స్ విఫలమైంది. ఈ ప్రయత్నంలోనూ అర్జెంటీనా విజయం సాధించడంతో ఫలితం 3-1గా మారింది. నాలుగో ప్రయత్నంలో ఫ్రాన్స్ గోల్ సాధించడంతో ఆధిక్యం 3-2గా మారింది. అయితే నాలుగో ప్రయత్నంలో మెస్సీ జట్టు మరో గోల్ సాధించడంతో అర్జెంటీనా శిభిరంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.
38 సంవత్సరాలు తర్వాత అర్జెంటీనా ప్రపంచకప్ కలను నెరవేర్చుకుంది. చివరగా 1986లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. అంతకుముందు 1978లోనూ తొలిసారిగా విజేతగా నిలిచింది. దీంతో ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్‌ను ముద్దాడింది అర్జెంటీనా.
సంబంధిత కథనం