Argentina Football Team: అర్జెంటీనా టీమ్‌కు ఘన స్వాగతం.. సెలబ్రేషన్స్ కోసం నేషనల్ హాలీడే
20 December 2022, 15:05 IST
- Argentina Football Team: అర్జెంటీనా టీమ్‌కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఫ్రాన్స్‌ను ఓడించి వరల్డ్‌కప్‌ను ముచ్చటగా మూడోసారి గెలిచిన ఆ టీమ్ మంగళవారం (డిసెంబర్ 20) స్వదేశంలో అడుగుపెట్టింది.
అర్జెంటీనా టీమ్ కు స్వాగతం పలుకుతున్న వేలాది మంది అభిమానులు
Argentina Football Team: ఫిఫా వరల్డ్‌కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడిన అర్జెంటీనా టీమ్.. మంగళవారం (డిసెంబర్ 20) తమ స్వదేశంలో అడుగుపెట్టింది. రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో వరల్డ్ ఛాంపియన్స్‌కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో డిఫెండిండ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్‌ను పెనాల్టీల్లో 4-2తో అర్జెంటీనా ఓడించిన విషయం తెలిసిందే.
ఈ విజయంతో స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన వరల్డ్‌కప్ కలను సాకారం చేసుకున్నాడు. ఈ ఫైనల్లోనూ మెస్సీ రెండు గోల్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మ్యాచ్ పెనాల్టీల వరకూ వెళ్లింది. అక్కడ అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ అద్భుతంగా సేవ్ చేయడంతోపాటు ఆ టీమ్ ప్లేయర్సంతా సక్సెస్ కావడంతో 4-2తో అర్జెంటీనా గెలిచింది.
మంగళవారం తెల్లవారుఝామున స్వదేశానికి వచ్చిన అర్జెంటీనా టీమ్‌కు వేలాది మంది అభిమానులు ఘన స్వాగతం పలికారు. అంతేకాదు టీమ్‌తో కలిసి దేశమంతా సెలబ్రేట్ చేసుకోవడానికి మంగళవారం నేషనల్ హాలీడే ప్రకటించడం విశేషం. ఈ వెల్‌కమ్ వీడియోను అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది.
తమ టీమ్‌ను చూసి ఫ్యాన్స్ ఎలా రియాక్టవుతారో చూడటానికి తాను ఆతృతగా ఉన్నట్లు మెస్సీ చెప్పాడు. "అర్జెంటీనాలో ఫ్యాన్స్ ఎలా రియాక్టవుతారో చూడాలని ఉంది. నా కోసం వాళ్లు వేచి చూడాలి. అక్కడికి వెళ్లి వాళ్లతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఆతృతగా ఉన్నాను" అని మెస్సీ అన్నాడు.