FIFA World Cup Final : అర్జెంటీనా, ఫ్రాన్స్ ఆటగాళ్లు.. స్టైలిష్ కార్లు- ఓ లుక్కేయండి!
FIFA World Cup Final : అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫీఫా వరల్డ్ కప్ సమరం ముగిసింది. అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ సమయంలో ఆటగాళ్లకు సంబంధించిన వివరాలను ప్రజలు తెగ వెతికేస్తున్నారు. మరి ఇరువైపుల కీలక ఆటగాళ్ల వద్ద ఉన్న ఖరీదైన, స్టైలిష్ కార్లపై ఓ లుక్కేద్దామా..
FIFA World Cup Final : ఇప్పుడు ఎక్కడ చూసినా 2022 ఫీఫా వరల్డ్ కప్ ఫైనలే హాట్ టాపిక్! అర్జెంటీనా- ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్.. ఫుట్‌బాల్ ప్రేమికులను ఉర్రూతలూగించింది. లియెనెల్ మెస్సీ మెరుపులు, ఎంబాపే పోరాటంతో ఉత్కంఠభరిత మ్యాచ్‌ను ప్రేక్షకులు వీక్షించారు. చివరికి ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పైచేయి సాధించి, కప్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇరువైపుల ఆటగాళ్లు చివరి నిమిషం వరకు పోరాడని విధానం ఫ్యాన్స్‌ను మెప్పించింది. ఫలితంగా ఇరు జట్ల ఆటగాళ్ల గురించి తెలుసుకునేందుకు అందరు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా, ఫ్రాన్స్‌లోని పలువురు ఆటగాళ్ల వద్ద ఉన్న ఖరీదైన, స్టైలిష్ కార్లను ఓసారి చూద్దాం..
అర్జెంటీనా..
లియోనెల్ మెస్సీ..
Messi cars list : ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ.. ఈ లిస్ట్‌లో కూడా టాప్‌లోనే ఉన్నాడు. ఈ అర్జెంటీనా దిగ్గజం గ్యారేజ్‌లో చాలా కార్లే ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫెరారీ 335 ఎస్ స్పైడర్ స్కాగ్లియెట్టి గురించే! 1950 దశకంలో ఫెరారీ రూపొందించిన నాలుగు స్పోర్ట్స్ కారుల్లో ఇదొకటి. ఇందులో 4.1లీటర్ వీ12 ఇంజిన్ ఉంటుంది. ఇది 400పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 300కేఎంపీహెచ్.
ఏంజెల్ డీ మారియో..
అర్జెంటీనా జట్టులో రైట్ వింగర్, ఫైనల్లో కీలక గోల్ కొట్టిన ఏంజెల్ డీ మారియో.. పార్షె, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్‌ను ఎక్కువగా నడుపుతాడని తెలుస్తోంది. అతని కార్ల కలెక్షన్లో అత్యంత ఖరీదైనదిగా లంబోర్ఘినీ హరికెన్ గుర్తింపు పొందింది. కానీ ఆయన వద్ద ఉన్న చెవర్లెట్ కార్వెట్టే స్టిన్గ్రే.. మరింత ప్రత్యేకం! ఇందులో 6.2లీటర్ వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇది 466పీఎస్ పవర్, 630ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 300కేఎంపీహెచ్. ఈ సూపర్ కారు.. 0-100 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 3.9సెకన్లలోనే అందుకుంటుంది.
లౌటారో మార్టినెజ్..
Argentina vs France Worldcup final : అర్జెంటీనా లైనప్‌లో కీలక అటాకర్‌గా పేరు తెచ్చుకున్న లౌటారో మార్టినెజ్ వద్ద కూడా లంబోర్ఘినీ హరికెన్ ఉంది. అయితే.. ఇది సరికొత్త ఈవీఓ స్పైడర్ ఎడిషన్. ఇందులో 5.2లీటర్ వీ10 ఇంజిన్ ఉంటుంది. ఇది 640పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది. హరికెన్ ఈవీఓ స్పైడర్.. టాప్ స్పీడ్ 325కేఎంపీహెచ్. 0-100 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 3.1 సెకన్లలో అందుకుంటుంది.
ఫ్రాన్స్..
కైలియన్ ఎంబాపే..
Mbappe vs Messi : ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్‌ను రసవత్తరంగా మార్చింది ఎవరైనా ఉంటే.. అది కైలియన్ ఎంబాపేనే! మ్యాచ్ చేజారిపోయిన దశలో వరుసగా రెండు గోల్స్‌కు ఫ్రాన్స్‌ను రేస్‌లో నిలిపాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో సత్తా చాటాడు. ఈ 23ఏళ్ల ఆటగాడి వద్ద చాలా కార్లే ఉన్నాయి. వోక్స్వ్యాగన్, ఆడీ, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్‌లోని చాలా మోడల్స్.. ఇతని గ్యారేజ్‌లో ఉన్నాయి. కానీ ఫెరారీ 488 పిస్తా.. ఇతని గ్యారేజ్‌లో హైలైట్‌గా నిలుస్తుంది! ఇందులో 3.9 ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇది 720పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 2.8 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 340కేఎంపీహెచ్.
ఆంటోయిన్ గ్రీజ్‌మాన్..
Mbappe cars list : మరో ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోయిన్ గ్రీజ్‌మాన్ వద్ద రోల్స్ రాయిస్ కుల్లినన్, వ్రైత్, మసెరేటి గ్రాన్టురిస్మో ఎస్, 1969 చెవర్లెట్ కార్వెట్టి స్టింగ్రేతో పాటు మరిన్ని వాహనాలు ఉన్నాయి. అయితే.. మెక్లారెన్ 675ఎల్టీ అనేది హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులో 3.8లీటర్ వీ8 ఇంజిన్ ఉంటుంది. 675పీఎస్ పవర్, 700ఎన్ఎం టార్క్‌ను ఇది జనరేట్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 330కేఎంపీహెచ్. 0-100 కేఎంపీహెచ్ వేగాన్ని ఇది కేవలం 2.8సెకన్లలోనే అందుకుంటుంది.
ఒలివర్ గిరౌడ్..
ఫ్రాన్స్ జట్టులో స్ట్రైకర్‌గా కొనసాగుతున్న ఒలివర్ గిరౌడ్ వద్ద సెకెండ్ జనరేషన్ బెంట్లే కాంటినెంటల్ జీటీ ఉంది. ఇందులో 4లీటర్ వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇది 600పీఎస్ పవర్‌ను జనరేట్ చేస్తుంది.
సంబంధిత కథనం