AR Ameen Escapes Accident: పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏఆర్ రెహమాన్ కుమారుడు.. ఏమైందంటే?
06 March 2023, 5:44 IST
- AR Ameen Escapes Accident: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు ఇటీవలే ముంబయిలో ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమీన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
రెహమాన్‌తో అమీన్
AR Ameen Escapes Accident: సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయన ఖ్యాతిని ఖండాంతరాలు విస్తరించారు. రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ కూడా తండ్రి అడుగు జాడల్లోనే కంపోజర్, గాయకుడిగా వెలుగొందుతున్నాడు. తాజాగా ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ షూటింగ్ సెట్‌లో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తన బృందంతో కలిసి కెమెరా ముందుకు ప్రదర్శన ఇస్తుండగా పైన వేళాడుతున్న షాండలియా ఒక్కసారిగా కిందపడింది. ఆ సమయంలో ఏఆర్ అమీన్ సహా తన టీమ్ అంతా వేదికపైనే ఉన్నారు.
అయితే షాండలియా కూలినప్పటికీ ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అమీన్‌తో పాటు అక్కడున్న వారంత తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొంటెం అటు ఇటు అయినా అందరి తలలు పగిలేవే. అదృష్టవశాత్తూ అలాంటిదేమి జరగలేదు.
ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఆ షాక్‌లో నుంచి తేరుకోలేకపోతున్నానని అమీన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫోస్ట్ చేశాడు. తన చేదు అనుభవాన్ని గురించి అభిమానులతో పంచుకున్నాడు. తన తల్లిదండ్రుల, భగవంతుడు, అభిమానుల ఆశీర్వాదం వల్లే తాను ఇవాళ బతికి ఉన్నానని లేదంటే చాలా ఘోరం జరిగి ఉండేదని తెలిపాడు. ఆ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు అమీన్.
రెహమాన్ కుమారుడు ప్రమాదం నుంచి తప్పించుకోవడంపై నెటిజన్లు సైతం విపరీతంగా స్పందిస్తున్నారు. కామెంట్ల రూపంలో తన స్పందనను తెలియజేస్తున్నారు రెహమాన్ కుటుంబం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ కూడా స్పందించారు. అలాగే భద్రతా ప్రమాణాల గురించి ప్రశ్నించారు.
"కొన్ని రోజుల క్రితం నా కుమారుడు ఏఆర్ అమీన్, అతడి బృందం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముంబయిలోని ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో అల్లా(భగవంతుడి) దయ వల్ల ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మన పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇండియన్ సెట్‌లు, లోకేషన్లు ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ ప్రమాజం సంభవించినప్పుడు మేమంతా ఎంతో కంగారు పడ్డాము. ఇన్సురెన్స్ కంపెనీతో పాటు నిర్మాణ సంస్థ గుడ్ ఫెల్లాస్ స్టూడియోస్ ఈ సంఘటనపై దర్యాప్తు ఫలితాల కోసం చూస్తున్నాం." అని రెహమాన్ అన్నారు.