AB de Villiers on Virat Kohli: విరాట్.. నీది మరో లెవల్: కోహ్లిపై డివిలియర్స్ ప్రశంసలు
16 January 2023, 11:16 IST
- AB de Villiers on Virat Kohli: విరాట్.. నీది మరో లెవల్ అంటూ కోహ్లిపై డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లి వన్డేల్లో తన 46వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లి కాళ్లు మొక్కుతున్న ఓ అభిమాని
AB de Villiers on Virat Kohli: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన విరాట్ కోహ్లిపై అతని బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ఈ సిరీస్‌లో అతడు రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడో వన్డేలో కేవలం 110 బాల్స్‌లోనే 166 రన్స్ చేశాడు. మొత్తంగా సిరీస్‌లో 141 సగటు, 137 స్ట్రైక్‌రేట్‌తో 283 రన్స్ చేయడం విశేషం.
ఆదివారం (జనవరి 15) జరిగిన మూడో వన్డేలో కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 110 బాల్స్‌లో 166 రన్స్ చేయడంతో ఇండియా ఏకంగా 390 రన్స్ చేసింది. ఆ తర్వాత శ్రీలంకను కేవలం 73 రన్స్‌కే కుప్పకూల్చి ఏకంగా 317 రన్స్‌తో రికార్డు విజయం సాధించింది.
ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లిపై కేవలం రెండే పదాల్లో ఎంతో అర్థం వచ్చేలా ప్రశంసలు కురిపించాడు ఏబీ డివిలియర్స్. "విరాట్ కోహ్లి!! మరో లెవల్" అని ఏబీ సోమవారం (జనవరి 16) ఉదయం ట్వీట్ చేశాడు. నిజానికి విరాట్ ఆడిన తీరు అలాగే ఉంది. సిరీస్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన అతడు.. రెండో మ్యాచ్‌లో విఫలమైనా.. మూడో వన్డేలో తన ఆటను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు.
మూడేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సెంచరీ లేక విమర్శలు ఎదుర్కొన్న విరాట్.. గతేడాది ఆసియా కప్ నుంచి మరోసారి గాడిలో పడ్డాడు. ఆ టోర్నీలో టీ20ల్లో తొలి సెంచరీ చేసిన విరాట్.. తర్వాత బంగ్లాదేశ్ టూర్‌లో టెస్టుల్లో, వన్డేల్లో.. ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనూ సెంచరీల మోత మోగించాడు. వన్డే వరల్డ్‌కప్ ఏడాదిలోకి అడుగుపెట్టిన సమయంలో కోహ్లి ఫామ్ ఇండియన్ టీమ్‌ను ఆనందానికి గురి చేసేదే.
"టీమ్‌కు సాయం చేసి బలమైన పొజిషన్‌లో నిలపాలన్న మైండ్‌సెట్‌తో ఆడుతున్నాను. బ్రేక్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచీ చాలా బాగా అనిపిస్తోంది. మైల్‌స్టోన్ కోసం ఆడటం లేదు. ఇదే కొనసాగించాలని అనుకుంటున్నాను" అని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లి చెప్పాడు.