Virat Kohli Breaks Sachin Record: స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ కోహ్లి - సచిన్ రికార్డులు బ్రేక్
15 January 2023, 18:46 IST
Virat Kohli Breaks Sachin Record: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారీ శతకంతో రాణించాడు విరాట్ కోహ్లి. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఆ రికార్డులు ఏవంటే...
విరాట్ కోహ్లి
Virat Kohli Breaks Sachin Record: ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లి (Virat Kohli) అద్వితీయ శతకంతో మెరుపులు మెరిపించాడు. 110 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, పదమూడు ఫోర్లతో 166 రన్స్ చేశాడు. కోహ్లి మెరుపు ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా 50 ఓవర్లలో 390 పరుగులు చేసింది. శ్రీలంకతో మ్యాచ్ ద్వారా కోహ్లి వన్డే క్రికెట్‌లో పలు రికార్డులను తిరగరాశాడు.
వన్డే ఫార్మెట్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ క్రికెటర్‌గా సచిన్ రికార్డ్‌ను అధిగమించాడు. శ్రీలంకపై కోహ్లికి ఇది పదో సెంచరీ కావడం గమనార్హం. గతంలో ఈ రికార్డ్ సచిన్ (Sachin Tendulkar)పేరు మీద ఉంది. ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు చేశాడు. సచిన్‌తో పాటు కోహ్లి కూడా వెస్టిండీస్‌పై 9 సెంచరీలు చేసి సమంగా నిలిచాడు.
తాజాగా శ్రీలంకతో సెంచరీతో ఈ రికార్డ్ జాబితాలో కోహ్లి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. అంతే కాకుండా స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ క్రికెటర్‌గా కోహ్లి మరో రికార్డ్‌ను నెలకొల్పాడు. ఈ జాబితాలో ఇన్నాళ్లు ఇరవై సెంచరీలతో సచిన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్ ద్వారా సచిన్ రికార్డ్‌ను కోహ్లి తిరగరాశాడు.
కోహ్లికి భారత గడ్డపై ఇది 21వ సెంచరీ కావడం గమనార్హం. కేవలం 101 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లి ఈ ఘనతను సాధించాడు. అంతే కాకుండా స్వదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 రన్స్‌తో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రికీ పాటింగ్ 5521 రన్స్‌తో రెండో స్థానంలో నిలవగా 5303 రన్స్‌తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో క్రికెటర్‌గా శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్ధనే రికార్డ్‌ను కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో సచిన్, సంగర్కర, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య తర్వాత విరాట్ కోహ్లి ఉన్నాడు.