Kanuma festival: కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదంటారు, ఎందుకు?
16 January 2024, 11:21 IST
- Kanuma festival: కనుమ రోజు ఎవరూ పొలిమేర దాటరు. ప్రయాణాలు చేయకూడదని ఇంట్లో పెద్దలు చెప్తూనే ఉంటారు. నిజంగానే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
కనుమ సంబరాలు
Kanuma festival: మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో మూడో రోజు కనుమ జరుపుకుంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. పంట కాలం మొత్తం తమకి అండగా నిలిచి పనుల్లో సాయపడిన పశువులను పూజిస్తారు. పక్షులకి ఈరోజు ఆహారం పెడతారు. రైతులు కనుమ రోజు తమ పశువులకి శుభ్రంగా స్నానం చేయించి పసుపు, కుంకుమ రాసి చక్కగా అలంకరిస్తారు.
పక్షుల కోసం ఇంటి గుమ్మాల దగ్గర ధాన్యం కంకులు వేలాడదీస్తారు. ఇక పశువులకి శుభ్రం చేసి వాటి కొమ్ములకి ప్రత్యేకంగా తయారు చేయించిన తొడుగులు వేస్తారు. మెడలో గంటలు కడతారు. కాళ్ళకి గల్ గల్ అనేలా గజ్జలు కడతారు. ఎద్దుల భుజాల మీద రంగు రంగుల కొత్త వస్త్రాలు వేసి వాటిని పూజిస్తారు. ఇంట్లో చేసిన పిండి పదార్థాలు కొంతమంది పశువులకి తినిపిస్తారు. అలాగే ఈరోజు ఖచ్చితంగా అందరూ మాంసాహారం వండుకుని తింటారు. అందరూ సంతోషంగా గడిపే ఈరోజు ప్రయాణాలు చేయకూడదని చెప్తారు.
కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయరు?
సంక్రాంతి పండుగ సొంత ఊర్లో జరుపుకోవాలని ఎంతో మంది తమ స్వస్థలాలకి చేరుకుంటారు. బంధువుల రాకతో ఏ ఇల్లు చూసినా కళకళాడిపోతుంది. ఇక ఉద్యోగాలు, దూర ప్రాంతాలకి వెళ్లాలని అనుకునే వాళ్ళు సంక్రాంతి అయిపోయిన తర్వాత ఊరు వెళ్లాలని అనుకుంటారు. సెలవులు అయిపోయిన తర్వాత అయితే ట్రాఫిక్ లో ఇరుక్కుపోతామని, బస్ టికెట్లు ఉండవని ఉద్దేశంతో సంక్రాంతి మరుసటి రోజు ప్రయాణాలు పెట్టుకుంటారు. కానీ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. కొంతమంది దీన్ని పెద్దగా పట్టించుకోరు కానీ మరికొంతమంది మాత్రం తప్పనిసరిగా పాటిస్తారు. కనుమ రోజు ప్రయాణాలు చేయడం వల్ల ఏదో ఒక అవాంతరం ఏర్పడుతుందని అంటారు.
కనుమ రోజు ప్రయాణాలు చేయకపోవడం వెనుక చిన్న కారణం కూడా ఉంది. పూర్వం బస్సులు వంటి వాహనాలు ఎటువంటివి ఉండవు. కేవలం ఎద్దుల బండి మీద మాత్రమే ప్రయాణాలు సాగేవి. కనుమ రోజు ప్రయాణం చేస్తే ఎద్దుల బండి మీద వెళ్లాల్సి వస్తుందని పూర్వం పెద్దలు ఆ ఒక్కరోజు అయినా కూడా ఎద్దులకి విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటారు. అందుకే ఆరోజు ప్రయాణాలు చేయరు.
కనుమ రోజు మాంసాహారం
కనుమ రోజు ఏ ఇంట్లో చూసినా మాంసాహారం ఘుమఘుమలాడిపోతాయి. భోగి, సంక్రాంతి పండుగ రెండు రోజులు మాంసం జోలికి వెళ్లరు కానీ కనుమ రోజు మాత్రం తప్పనిసరిగా మాంసాహారం తీసుకుంటారు. పితృ దేవతలకి తర్పణాలు వదలడం చేస్తారు .మిగతా రోజుల్లో తర్పణాలు పెట్టినా పెట్టకపోయిన సంక్రాంతి సమయంలో పెట్టడం వల్ల పితృ దేవతలు సంతోషిస్తారని చెబుతారు. వారి ఆశీర్వాదాలు కుటుంబం మీద ఉంటాయని నమ్ముతారు. కొన్ని ఊర్లలో అయితే ఈరోజు పితృ దేవతలకి వారిని స్మరించుకుంటూ బలులు ఇస్తారు. ఇంట్లో అందరూ సంతోషంగా కూర్చుని భోజనం చేస్తారు. కనుమ నాడు మరొక సామెత కూడా వాడుకలో ఉంటుంది. కనుమ రోజు మినుములు తినాలని చెప్తారు. ఎందుకంటే మాంసం తినని వాళ్ళు పోషకాలు ఉండే మినుములు తింటే మంచిదని అంటారు.