Kanuma festival: కనుమ రోజు పశువులను ఎలా పూజించాలి-why cattle worship on kanuma festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanuma Festival: కనుమ రోజు పశువులను ఎలా పూజించాలి

Kanuma festival: కనుమ రోజు పశువులను ఎలా పూజించాలి

Gunti Soundarya HT Telugu
Published Jan 16, 2024 07:00 AM IST

Kanuma: కనుమ రోజు ఖచ్చితంగా పశువులని పూజిస్తారు. వాటిని ఇంటి సొంత మనుషులు మాదిరిగా చూసుకుని అందంగా అలంకరిస్తారు.

పశువుల పండుగ కనుమ
పశువుల పండుగ కనుమ (freepik)

Kanuma: తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మొదటి రోజు భోగి మంటలు, రెండో రోజు సంక్రాంతి జరుపుకుంటారు. మూడో రోజు కనుమ పండుగ చేసుకుంటారు. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్క రైతు తమ ఇంట్లో ఉన్న పశువులని పూజిస్తారు.

సంక్రాంతి సమయానికి ఎంతో శ్రమించి వేసుకున్న పంట చేతికి వస్తుంది. తమకి అండగా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరం పాటు తమకి సహాయంగా ఉన్న మూగ జీవాలని, పశు పక్ష్యాదులని గౌరవిస్తారు. ఈరోజు పక్షులకు, పశువులకి ఆహారం పెడతారు. పక్షుల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కట్టుకుంటారు.

పశువులని ఎందుకు పూజిస్తారు?

పంట పొలాలకు పశువులు గొప్ప సంపద. అవి లేకుండా రైతులు ఒక్క పని కూడా చేయలేరు. పంట వేసిన దగ్గర నుంచి అది చేతికి వచ్చే వరకు ఎద్దులు చాలా శ్రమిస్తాయి. పల్లె ప్రాంతాల్లో అందరూ పశువుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తమ నోటికి ఆహారం వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించే పశువుల పట్ల రైతులు ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటారు. అందుకే కనుమ రోజు వాటిని పూజిస్తారు. 

పండుగ రోజు పశువులని దగ్గరలో ఉన్న చెరువులకి లేదా కుంటలకి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయిస్తారు. మురికి లేకుండా చక్కగా వాటిని చక్కగా శుభ్రం చేసుకుంటారు. వాటికి కొమ్ములకి అందమైన వస్తువులు తగిలిస్తారు. కాళ్ళకి గజ్జెలు కడతారు. మెడలో గంటలు కట్టి పసుపు, కుంకుమతో వాటిని పూజిస్తారు. ఎద్దుల వీపుల మీద అందమైన రంగు రంగుల వస్త్రాలు కప్పుతారు.

అందంగా అలంకరించిన తర్వాత వాటికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తారు. పండించిన పంటని ఉపయోగించి పొంగలి తయారు చేసి పశువులకి నైవేద్యంగా పెడతారు. కొంతమంది ఇంట్లో చేసుకున్న పిండి వంటలు కూడా పశువులకి పెడతారు. భోగి, సంక్రాంతి రోజు ఎటువంటి మాంసాహారం తీసుకోరు. కానీ కనుమ రోజు మాత్రం అందరూ మాంసాహారం తీసుకుంటారు. కుటుంబాలు, స్నేహితులు పంట కాలాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒకరికొకరు బహుమతులు, స్వీట్లు, పిండి వంటలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.

కోడి పందేలు

కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు, ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. పశువులని హింసించే విధంగా పందేలు నిర్వహించకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల వాళ్ళు మాత్రం వాటిని నిర్వహిస్తారు. కోనసీమలో అయితే మైదానాల్లో టెంట్లు వేసి బహిరంగంగా కోడి పందేలు నిర్వహిస్తారు. సంక్రాంతి మూడు రోజులు అక్కడ జోరుగా కోడి పందేలు నిర్వహిస్తారు. కొన్ని కోట్లలో పందేలు జరుగుతాయి. వీటిని తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు వస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా కోడి పందేలు చూసేందుకు క్యూ కడతారు.

కొన్ని చోట్ల పశువులని ఎంతో భక్తితో ఆరాధిస్తారు. మరికొంతమంది మాత్రం సంక్రాంతి సమయంలో జల్లికట్టు నిర్వహిస్తారు. తమిళనాడులో జల్లికట్టు నిర్వహించడం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ ఆచారాన్ని మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

Whats_app_banner