Chaturmasam 2024: నేటి నుంచి 118 రోజులు ఈ పనులు నిషిద్ధం.. ఇలా చేస్తే మాత్రం అదృష్టమే మారిపోతుంది
17 July 2024, 7:14 IST
- Chaturmasam 2024: నేటి నుంచి చాతుర్మాసం ప్రారంభం అయ్యింది. కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి వరకు కొన్ని పనులు చేయడం నిషిద్ధం. కేవలం దేవుడికి సంబంధించిన కార్యాలు ఎక్కువగా చేయాలి. అవి ఏంటి? ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
నేటి నుంచి 118 రోజులు ఈ పనులు నిషిద్ధం
Chaturmasam 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం తొలి ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభంఅవుతుంది. మహా విష్ణువు యోగ నిద్ర స్థితిలోకి ప్రవేశించిన నాలుగు నెలల సమయాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు నిర్వహించరు.
చాతుర్మాసంలో పూజలు, యాగాలు, ఉపవాసాలు, దానధర్మాలు, పుణ్యకార్యాలు చిత్త శుద్ధితో చేస్తే అదృష్ట ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది చాతుర్మాసం శుక్ల యోగం, సౌమ్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం సహా అనేక శుభ యోగాలు ఉన్నాయి. ఈ సమయంలో శివుడు, విష్ణువులను పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. మత విశ్వాసాల ప్రకారం దేవతలు, విష్ణువు ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. కార్తీక మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున మేల్కోంటాడు. అందుకే చాతుర్మాసాల్లో సనాతన ధర్మంలో ఎలాంటి శుభకార్యాలూ జరగవు.
చాతుర్మాసంలో చేయాల్సిన పనులు
చాతుర్మాస సమయంలో దేవుడిని పూజించడం, పూజలు చేయడం, ఇంట్లో పూజలు వ్రతాలు చేపట్టడం వంటి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. సాధువులు ఈ మాసంలో ధ్యానం చేస్తారు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మహా విష్ణువును పూజించడం, భగవద్గీత పఠనం చేయడం చేయాలి. పేదలకు డబ్బు, దుస్తులు, గొడుగులు, చెప్పులు, ఇతర నిత్యావసరాలను దానం చేయండి.
చాతుర్మాసంలో చేయకూడని పనులు
చాతుర్మాసంలో భూమి పూజ, వివాహం, గృహప్రవేశం, ఉపనయన సంస్కారం వంటి అన్ని శుభకార్యాలు నిషేధం. ఈ రకమైన కొత్త పని ప్రారంభించకూడదు. ఈ సమయంలో ఎటువంటి పని చేపట్టినా శుభ ఫలితాలు లభించవు. పెరుగు, ముల్లంగి, బెండకాయలు, ఆకుకూరలు తీసుకోవడం కూడా నిషిద్ధం. అబద్ధాలు చెప్పకూడదు, ఇతరులను మోసం చేయకూడదు.
చాతుర్మాసంలో పాటించాల్సిన నియమాలు
చాతుర్మాసంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పటాయించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. చేపలు, మాంసం, మద్యపానం, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలు తినకూడదు. చాతుర్మాస్ సమయంలో బ్రహ్మచర్యం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ సమయంలో నేలపై పడుకుని సూర్యోదయానికి ముందే లేవాలి. స్నానం చేసి క్రమం తప్పకుండా పూజ చేయాలి. వీలైనంత నిశ్శబ్దంగా ఉండండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకూడదు.
ధ్యానం, యోగా వంటిని చేయాలి. విష్ణువు, శివుడిని పూజించాలి. పూర్వీకుల కోసం ప్రార్థనలు చేయాలి. పేదలకు నిరాశ్రయులకు వీలైనంత వరకు దానం చేయాలి. ఆరోగ్యం, ఐశ్వర్యం, దుఃఖం, పాపాలు తొలగిపోవడం కోసం ఈ పనులు తప్పనిసరిగా చేయాలి.
ఈ మాసంలో ఇలా చేస్తే మీ అదృష్టమే మారిపోతుంది
చాతుర్మాసంలో కొన్ని నిర్దిష్టమైన పనిని చేయడం జీవితంలో వివిధ రకాల శుభ ప్రభావాలను కలిగిస్తుంది. నేల మీద నిద్రించడం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కెరీర్ లో ప్రమోషన్ కోసం చెప్పులు, బట్టలు దానం చేయాలి. శత్రువుల నుంచి విముక్తి పొందటం కోసం మంత్రాలు పఠించాలి. ఇలా చేస్తే జీవితంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రు బాధ తొలగిపోతుంది.
రుణ భారం ఎక్కువగా ఉంటే చాతుర్మాస సమయంలో అన్నదానం చేయడం ఉత్తమం. భగవద్గీతను పఠించాలి. గత ఏడాది 148 రోజుల పాటు చాతుర్మాసం ఉంటే ఈ ఏడాది మాత్రం 118 రోజులు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఖర్మలు కూడా ఈ ఏడాది ఉండవు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.