Dhanurmasam 2022 : ఆమాసంలో ఏ ఒక్క రోజు విష్ణువును పూజించినా.. వేల సంవత్సరాలు పుణ్య ఫలితం పొందవచ్చట
Dhanurmasam 2022 : ధనుర్మాసము మార్గశిర మాసములో సంభవించడం విశేషమని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆరోజు చేసే వ్రతం చాలా ప్రత్యేకమైనదని.. ఆ సమయంలో ఏమి చేయాలో.. విష్ణువును ఎలా ఆరాధించాలో.. వ్రతం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dhanurmasam 2022 : జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాల విభజన సూర్యచంద్రుల వలన జరుగుతుంది. చంద్రుడు పౌర్ణమిరోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉంటాడో.. ఆ నక్షత్రము ఆధారంగా మాసములు ఏర్పడుతాయి. ఉదాహరణకు పౌర్ణమి చంద్రుడు మృగశిరా నక్షత్రం దగ్గర సంచరించుట చేత కేంద్రమానం ప్రకారం ఈ మాసమును మార్గశిర మాసమంటారని చెప్తారు. సూర్య సిద్ధాంతం ప్రకారం సూర్యుడు ఏ రాశినందు సంచరించునో ఆ మాసమునకు ఆ రకమైన పేరు ఏర్పడినట్లు చెప్తారు. ఉదాహరణకు డిసెంబర్ 16వ తారీఖున సూర్యుడు ధనూరాశిలో ప్రవేశిస్తున్నాడు. అందుకే డిసెంబర్ 16వ తేదీనుంచి జనవరి 15 వరకు మధ్య ఉన్నటువంటి మాసమునకు ధనుర్మాసమనే పేరు వచ్చిందని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యశాస్త్రవేత్త, చిలకమర్తి పంచాంగ రూపకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ధనుర్మాసము మార్గశిర మాసములో సంభవించడం విశేషము. దక్షిణాయానంలో ఆఖరి మాసం ధనుర్మాసము. మాసానాం మార్గశిరోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పారు. అందువల్ల మార్గశిర మాసమునకు చాలా ప్రాధాన్యతనిస్తారు. అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసము, ధనుర్మాస వ్రతము చాలా ప్రత్యేకమైనది. శివారాధనకు కార్తీకమాసం ఎంతటి విశేషమైనదో.. విష్ణుమూర్తి ఆరాధనకు ధనుర్మాసం అంత పవిత్రమైనది.
ధనుర్మాసములో ప్రాతఃకాల సమయంలో స్నానమాచరించి.. విష్ణుమూర్తి ఆలయములో దర్శనము చేసుకొని మహా విష్ణువును అర్చించిన వారికి కొన్ని వేల రెట్ల పుణ్య ఫలం లభిస్తుంది. ధనుర్మాసములో ఉదయం, సాయంత్రము ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీదేవి వద్ద ఆవునేతితో దీపారాధన చేసిన వారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో ఉదయం పూట విష్ణుమూర్తిని పూజించడం, సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. ధనుర్మాసంలో ఏ ఒక్క రోజు మహావిష్ణువును పూజించినా.. కొన్ని వేల సంవత్సరాలు మహా విష్ణువును పూజించిన ఫలితము వస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
విష్ణువును ఇలా పూజించాలి..
ఏ వ్యక్తి అయితే జీవితంలో ఆనందమును, ఆయుషును, మరణానంతరం మోక్షమును కోరుకుంటాడో.. అలాంటివారు కచ్చితంగా ధనుర్మాసమును ఆచరించాలి. (ధనుర్మాస వ్రతము చేయాలి). ధనుర్మాసము ఆచరించే వారు సూర్యోదయమునకు పూర్వమే లేచి, స్నానమాచరించి, సంధ్యావందనము పూర్తి చేసుకొని.. మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో తులసీదళాలతో పూజించాలి. అలాగే మహావిష్ణువును పంచామృతాలతో అభిషేకించి.. తులసి నీళ్లను శంఖములోని నీళ్లతో స్వామిని అభిషేకించడం వంటివి చేయాలి. విష్ణుమూర్తిని పూజించే మాసము కనుకనే ఈ మాసంలో శుభకార్యములు నిషేధించారు.
ధనుర్మాసములో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ధనుర్మాసములో వచ్చే ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై పఠించిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. సాక్షాత్తు భూదేవి అవతారమూర్తియైన ఆండాళ్ అమ్మవారు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. తిరుప్పావై అనగా తిరు అంటే పవిత్రమైన పవై అనగా వ్రతము. తిరుప్పావై అనగా పవిత్రమైన వ్రతము అని అర్థము. వేదాల ఉపనిషత్తు సారమే తిరుప్పావై అని పూర్వాచార్యులు తెలిపారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట తిరుప్పావై రూపంలో చెప్పినట్లు.. అందుకే తిరుప్పావై మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి సులభమైన మార్గముగా చెప్తారు.
ధనుర్మాసములో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పూజించి పులగం, చక్రపొంగలి నివేదన చేయాలి. ఈవిధముగా ఏ వ్యక్తి అయితే ధనుర్మాసములో పుణ్య నదీ స్నానాలు ఆచరించి.. ప్రాతఃకాలంలో విష్ణుమూర్తిని పూజించి.. సాయంత్ర సమయంలో లక్ష్మీదేవిని పూజించి.. ఈ మాసములో పుణ్య దానములు వంటివి ఆచరించి.. తిరుప్పావై వంటివి చదువుతారో వారికి మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదమహర్షికి వివరించినట్లుగా పురాణ కథనం. ధనుర్మాసానికి సంబంధించిన విషయాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలలో, భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తాయి.
ధనుర్మాసంలో ఆండాళ్లమ్మ పూజ, గోదాదేవి కళ్యాణం, తిరుప్పావై పఠనం మొదలైనవి సాంప్రదాయమని పెద్దలు చెప్తారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి ధనుర్మాసములో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేయడం విశేషం. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసములో సహస్ర నామార్చనలో తులసీ దళాల బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. ఈ విషయాలన్నీ ధనుర్మాస విశిష్టతను మనకు తెలియజేస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్