Vasant panchami: 2024 లో వసంత పంచమి ఎప్పుడు? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి?
20 December 2023, 15:10 IST
- Basanth panchami 2024: వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజిస్తారు. అమ్మవారిని పూజించడం వల్ల విద్యాప్రాప్తి లభిస్తుందని ఎంతోమంది నమ్మకం.
సరస్వతీ దేవి
Basanth panchami 2024: హిందూమతంలో వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. అలా చేస్తే వాళ్ళు విద్యలో చక్కగా రాణిస్తారని నమ్ముతారు. వసంత అంచమి రోజు సరస్వతీ దేవిని పూజిస్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం జ్ఞానానికి అధిదేవత సరస్వతి దేవి వసంత పంచమి రోజున అవతరించారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి పండుగని ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్షంలో ఐదో రోజున జరుపుకుంటారు. అప్పటి నుంచే వసంత రుతువు ప్రారంభమైనట్టు భావిస్తారు.
వసంత పంచమి శుభ ముహూర్తం
పంచాగం ప్రకారం తిథి ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 2.41 గంటలకి ప్రారంభమై ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12.09 గంటలకి ముగుస్తుంది.
సరస్వతి పూజ ముహూర్తం: వసంత పంచమి రోజు సరస్వతీ పూజ పవిత్ర సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు ఉంటుంది. మొత్తం పూజ సమయం 5 గంటల 35 నిమిషాలు.
వసంత పంచమి ప్రాముఖ్యత
ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవి దగ్గర పుస్తకాలు, పెన్నులు ఉంచి పూజ చేస్తారు. ఇలా పూజించడం వల్ల జ్ఞానం పొందుతారని నమ్ముతారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ముహూర్తం లేకపోయినా ఆ రోజు ఏదైనా పని ప్రారంభించడం మంచిదని భావిస్తారు.
వసంత పంచమి పూజా విధి
సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా తెల్లని వస్త్రాలు ధరించాలి. సరస్వతీ దేవి విగ్రహాన్ని ఉత్తర దిక్కున పెట్టి పూజించాలి. సరస్వటీ మాత విగ్రహానికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. రోలి, గంధం, పసుపు, కుంకుమ పువ్వు, పసుపు లేదా తెలుపు రంగు పువ్వులు, నైవేద్యం, అక్షత్ సమర్పించాలి. అమ్మవారి ముందు సంగీత వాయిద్యాలు, పుస్తకాలు ఉంచి పూజ చేయాలి. విద్యారులు కావాలనుకుంటే ఆ రోజున సరస్వతీమాత కోసం ఉపవాసం ఉండవచ్చు.
సరస్వతీ పూజ కోసం దేవత విగ్రహం లేదా చిత్రపటాన్ని ఎన్నుకునేటప్పుడు తామర పువ్వు మీద కూర్చున్న భంగిమలో ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దేవత నిలబడి ఉన్న భంగిమలో ఉన్న చిత్రాన్ని నివారించాలి.
“యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః”.. శ్లోకం చదవితే మంచిది.
బాసరి ఎందుకంత ప్రత్యేకం
వసంత పంచమి రోజు బాసర క్షేత్రం మొత్తం భక్తులతో నిండిపోతుంది. అక్కడ ఉన్న సరస్వతీ దేవిని దర్శించుకుని తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు. కురక్షేత్ర యుద్ధం వల్ల మనసు చలించిపోయిన వ్యాసులు తపస్సు చేసుకోవడానికి గోదావరి తీరంలో ఉన్న బాసరకి వచ్చారు. అక్కడ వ్యాసుల వారికి సరస్వతి దేవి సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పిందట. అలా వ్యాసుల వారు ఇసుకతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు. అదే ఇప్పుడు కనిపించే మూల విరాట్. నిత్యం అమ్మవారికి పసుపు రాస్తూ పూజలు చేస్తారు.
శాంతిస్వరూపులైన సరస్వతి దేవి ఒక చేతిలో వీణ, మరో చేతిలో పుస్తకం, జపమాల, అభయ ముద్రలు ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞానం, బుద్ధులకి ప్రతీకగా చెప్తారు. అన్నదానం తర్వాత విద్యాదానం గొప్పదని చెప్తారు. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతారు.