Vastu Tips । మీ ఇంట్లో మనీప్లాంట్ ఉందా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!
11 December 2022, 16:59 IST
- Vastu Tips -Rules for Money Plant: ఇంట్లో మనీప్లాంట్ ఉంటే అదృష్టం కలిసి వస్తుందా? ఏ దిశలో ఉండాలి, వాస్తు నియమాలు ఏం చెబుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి.
Vastu Rules for Money Plant
చెట్లకు డబ్బులు కాస్తాయో లేదో తెలీదు కానీ, చాలా మంది తమకు డబ్బు బాగా రావాలని మనీప్లాంట్ అనే మొక్కను తమ ఇళ్లల్లో పెంచుకుంటారు. అది కూడా ఇంకొకరి ఇంటి నుంచి దొంగచాటుగా తెచ్చుకొని పెంచుకుంటే లాభం ఉంటుందని చాలా మంది నమ్మకం. అయితే వాస్తు శాస్త్రంలో కూడా ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, మనీప్లాంట్ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. ఇంటి ఆనందం, శ్రేయస్సుపై కూడా మనీ ప్లాంట్ ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. కానీ, ఈ మనీప్లాంట్ కూడా ఇంట్లో సరైన దిశలో ఉండాలి. తప్పుడు దిశలో ఉంచితే ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మరి మనీప్లాంట్ పెంచడానికి సరైన దిశ ఏది, ఎలా పెంచాలో ఇక్కడ తెలుసుకోండి.
మీరు మనీ ప్లాంట్‌ను ఇంటికి ఈశాన్యం దిశలో ఉంచినట్లయితే, అది మీకు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఈశాన్య దిశలో ఉంటే దానిని అక్కడ్నించి తొలగించండి. మనీప్లాంట్ పెంచటానికి అత్యంత కచ్చితమైన దిశ ఆగ్నేయంగా పరిగణించబడుతుంది. పనులలో విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ఆగ్నేయ దిక్కున నివసిస్తాడు. కాబట్టి మనీ ప్లాంట్‌ను ఈ దిక్కున ఉంచాలని చెబుతారు. మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఆగ్నేయ దిశలో పెంచడం ద్వారా అది పెరుగుతున్న కొద్దీ, ధన వృద్ధి జరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు.
Vastu Rules and Tips for Money Plant
మనీ ప్లాంట్ పెరగటానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. చిన్న తీగముక్కను నీటిలో ఉంచినా సరే, దానంతటదే పెరుగుతుంది. అయితే మనీప్లాంట్ తీగ సాధారణంగా 7 అడుగుల వరకు పెరుగుతుంది. దీనికి ప్రతిరోజూ సరైన నీటితో పాటు, తగినంత వెలుతురు కూడా అందితే ఇది 12 అడుగుల వరకు పెరుగుతుంది. మనీప్లాంట్ ఎంత బాగా తీగపారితే అంతగా అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. మరిన్నినియమాలు ఈ కింద చూడండి.
మనీ ప్లాంట్ నేలను తాకకూడదు
మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ లక్ష్మీ దేవి రూపమని నమ్ముతారు. కాబట్టి, మొక్క తీగలు నేలను తాకకుండా జాగ్రత్త వహించండి. దాని తీగలను తాడు సహాయంతో పైకి, పక్కలకు వెళ్లేలా చూడాలి. వాస్తు ప్రకారం, పెరుగుతున్న తీగలు పెరుగుదల, శ్రేయస్సుకుచిహ్నం.
పడకగదిలో పెంచుకోవచ్చా?
మనీ ప్లాంట్‌ను పడక గదిలో కూడా పెంచుకోవచ్చు. మీకు నిద్రలేమి సమస్యలు, జీవితంలో ఆందోళనలు ఉంటే పడకగదిలో ఒక మూలలో మనీ ప్లాంట్ పెంచుకోండి. అయితే అది ఆరోగ్యంగా పెరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకునే బాధ్యత మీదే.
ఇంటి బయట పెరిగితే?
మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ మీ ఇంటి లోపలే పెంచుకోవాలి. ఇంటి బయట పెంచితే సంపద బయటే ఉంటుందని అంటారు. కాబట్టి ఈ మొక్కను వాస్తుపరంగా సరైన దిశలో, సరైన మూలలో ఉంచడంతో పాటు నీరు, సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తపడండి.
మనీ ప్లాంట్ ఎండిపోవద్దు
వాస్తు ప్రకారం, ఎండిన మనీ ప్లాంట్ దురదృష్టానికి చిహ్నం. ఇది మీ ఇంటి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. దీన్ని నివారించడానికి మనీ ప్లాంట్‌కు రోజూ నీరు పోస్తూ ఉండండి. ఆకులు ఎండిపోతే, వాటిని కత్తిరించి తొలగించండి.
ఇతరులకు మనీ ప్లాంట్లు ఇవ్వకండి
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌లను ఇతరులకు ఇవ్వకూడదు. ఇది శుక్ర గ్రహానికి కోపం తెప్పిస్తుంది. శుక్రుడు అభివృద్ధి, శ్రేయస్సుకు చిహ్నం. మనీప్లాంట్ ఇతరులకు దానం చేయడం వలన మీకు దక్కాల్సిన పుణ్యఫలాలు దూరమవుతాయి
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.
టాపిక్