Vastu Tips । మీ ఇంట్లో పాత వస్తువులు ఉంచుకోకండి, ఈ 5 ఉంటే చాలా నష్టం!
Vastu Tips- మీ ఇంట్లో పాత వస్తువులు చాలా ఉన్నాయా? అయితే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. వెంటనే ఇలాంటి వస్తువులను మీ ఇంట్లో నుంచి తొలగించండి.
వాస్తుశాస్త్రం ప్రకారం, మనం ఇంట్లో ఉంచుకునే మన ఇంట్లోని ప్రతి వస్తువుకు శుభ, అశుభ ప్రభావాలు ఉంటాయి. ఒక వస్తువు పాతదైనా, కొత్తదైనా, ప్రతిదీ ఏదో ఒక రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వాస్తుశాస్త్రంలో ఈ శక్తులను సానుకూల శక్తి , అలాగే ప్రతికూల శక్తిగా విభజించారు. వాస్తు పరంగా కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం ద్వారా సానుకూల సంకేతాలు ఉంటాయి, వీటితో అంతా మంచే జరుగుతుంది. అదే సమయంలో ఇంట్లో నిరుపయోగంగా పడి ఉండే పాత వస్తువులను అలాగే ఉంచుకోవడం వలన, అవి ఇంట్లో ప్రతికూల శక్తులకు ఆవాసంగా మారతాయి.
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైనపుడు అది ఆ ఇంట్లో వారికి చాలా రకాల సమస్యలను కలిగిస్తుంది. ఇది ఇంటి పురోగతి, శ్రేయస్సును అడ్డుకుంటుంది. పనులు ముందుకు సాగవు, అంతా గందరగోళంగా ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. తరచూ అనారోగ్యాల బారినపడటం లేదా ప్రమాదాలు చోటు చేసుకోవడం జరగవచ్చు. కాబట్టి మీకు ఉపయోగం లేని పాత వస్తువులను ఇంట్లో ఎట్టిపరిస్థితుల్లో ఉంచుకోకూడదు.
Vastu Tips- Do Not Keep Old Things in the House
పాత వస్తువులు ఇంట్లో ఉంచవద్దు, వీలైనంత త్వరగా బయటకు విసిరేయండి. ఎలాంటి వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయో ఇక్కడ చూడండి.
పాత వార్తాపత్రికలు
కొంతమందికి పాత వార్తాపత్రికలను సేకరించి ఇంట్లో పేర్చే అలవాటు ఉంటుంది. నిజానికి పాత వార్తాపత్రికలు ప్రతికూల శక్తికి ఆవాసంగా ఉంటాయి. వీటితో ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పాత వార్తాపత్రికలు దుమ్ము, ధూళిని ఆకర్శిస్తాయి. ఈ రకంగా ఇది అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీ కుటుంబంలో తరచూ విభేదాలు తలెత్తుతున్నాయంటే, మీ జీవితంలో ఎలాంటి పురోగతి లేదని భావిస్తే వెంటనే పాత పేపర్లను బయటకు విసిరేయండి.
పాత తాళాలు
వాస్తు శాస్త్రం ప్రకారం పాత తాళాలను ఇంట్లో ఉంచడం చాలా అశుభం. ఉపయోగించని, దెబ్బతిన్న తాళాలను వెంటనే తొలగించాలి. ఎప్పుడూ తాళం వేసి ఉండే తాళాలు మీ అదృష్టాన్ని బంధిస్తాయని నమ్ముతారు. ఇది మీ పురోగతికి అడ్డుగా నిలుస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇంట్లో పాత తాళాలు ఉంటే వెంటనే తీసేయాలి.
పాత గడియారాలు
కదిలే గడియారాలు కాల చక్రాన్ని సూచిస్తాయి. కానీ ఆగిపోయిన పాత గడియారాలు జీవితంలో ఏ పని ముందుకు సాగకుండా అడ్డంకులను సృష్టిస్తాయి. కాబట్టి అలాంటి గడియారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచవద్దు. ఆగిపోయిన గడియారాలు జీవితంలో మంచి సమయం, ఆనంలు రాకుండా నిరోధిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. కాబట్టి అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిది.
చాలా కాలం నాటి పాదరక్షలు
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం రెండింటి ప్రకారం చాలా కాలంగా అరిగిపోయిన బూట్లు లేదా చెప్పులు ధరించడం చాలా అశుభకరమైనదిగా పరిగణించడ జరుగుతుంది. అలాంటి పాదరక్షలను ఇంట్లో ఉంచడం ద్వారా జీవితంలో విభేదాలను సృష్టిస్తుంది. మీ వద్ద ఎక్కువ సంఖ్యలో పాదరక్షలు ఉన్నప్పటికీ, అవి ఉత్తమ స్థితిలో, శుభ్రంగా ఉండాలి. అలాకాకుండా తెగిపోయి, చిరిగిపోయి, అరిగిపోయి, దుమ్ము పట్టి ఉంటే వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు. మీరు ధరించని పాత పాదరక్షలను బయట పడేయాలి. శనివారం నాడు బయట పడేయడం వలన శని దోషం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
పాత బట్టలు
వాస్తు శాస్త్రం ప్రకారం మనం ధరించే దుస్తులు మన భవిష్యత్తును, శ్రేయస్సును ప్రతిబింబిస్తాయి. కానీ ఉపయోగించని పాత బట్టలు ఇంట్లో ఉంచుకోవడం అశుభం. ఎందుకంటే ఇవి మీ కెరీర్‌లో సమస్యలను సృష్టిస్తాయి. ఇది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో పాత బట్టలు ఉంటే వాటిని దానం చేయడమో, పాడేయడమో చేయాలి.
గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారానికి కచ్చితమైన ఆధారాలు ఏమి లేవు. ఇవి మత విశ్వాసాలు, పురాణ గ్రంథాల ప్రకారం మాత్రమే అందించినది.
సంబంధిత కథనం
టాపిక్