తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Nagula Chavithi 2024: రేపే నాగుల చవితి- శుభ సమయం, పూజా విధానం, పఠించాల్సిన శ్లోకం ఇదే

Nagula chavithi 2024: రేపే నాగుల చవితి- శుభ సమయం, పూజా విధానం, పఠించాల్సిన శ్లోకం ఇదే

Gunti Soundarya HT Telugu

04 November 2024, 19:38 IST

google News
    • Nagula chavithi 2024: దీపావళి తర్వాత కార్తీకమాసం ప్రారంభంలో జరుపుకునే పండుగ నాగుల చవితి. ఈ ఏడాది నవంబర్ 5న జరుపుకోనున్నారు. ఈరోజు శుభ సమయం, పూజా విధానం, పఠించాల్సిన శ్లోకం గురించి ఇక్కడ తెలుసుకోండి. 
నాగుల చవితి పూజా విధానం
నాగుల చవితి పూజా విధానం (pixabay)

నాగుల చవితి పూజా విధానం

కార్తీక మాసంలో హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ పండుగను ప్రధానంగా జరుపుకుంటారు. నాగదేవతలను ఈరోజు ఆరాధిస్తారు. 

వివాహిత స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి గుడికి వెళ్ళి నాగదేవతకు పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని రక్షించమని వేడుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. శ్రేయస్సు కోసం నాగదేవతల ఆశీస్సులు కోరుతూ పూజ చేస్తారు. ఈ ఏడాది నాగుల చవితి నవంబర్ 5వ తేదీన జరుపుకోనున్నారు. పూజా ముహూర్తం, శుభ సమయం, పఠించాల్సిన శ్లోకం గురించి తెలుసుకుందాం. 

శుభ సమయం 

నాగుల చవితి పూజ ముహూర్తం ఉదయం 10. 59 నుంచి మధ్యాహ్నం 1.10 వరకు ఉంది. వ్యవధి 2 గంటల 10 నిమిషాలు 

చవితి తిథి ప్రారంభం నవంబర్ 4 రాత్రి 11.24 నుంచి చవితి తిథి ముగింపు నవంబర్ 6 అర్ధరాత్రి 12.16 వరకు ఉంటుంది. ఉదయ తిథి చవితి ఉండాలి. అందువల్ల నవంబర్ 5న సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చవితి తిథి ఉంటుంది. 

నాగుల చవితి పూజ విధానం

నాగుల చవితినాడు భక్తుల పొద్దున్నే స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించి గుడికి వెళ్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటారు. సర్పదేవతలను ఆరాధిస్తారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యం వంటివి నాగదేవతలకు సమర్పిస్తారు. ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకునే వాళ్ళు నాగ ప్రతిమ లేదా మట్టితో చేసిన ప్రతిమను ప్రతిష్టించుకుని పూజ చేసుకోవచ్చు.   నాగదేవతలను దర్శించుకుని పుట్టలో పాలు పోస్తారు. సర్పదేవతలకు పండ్లు, పువ్వులు, కుంకుమ సమర్పిస్తారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తారు. మహిళలు తమ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పుట్ట చుట్టూ రక్షా సూత్రం కడతారు. 

పూర్వం నాగుల చవితి రోజు భూమి మీద దున్నడం, మట్టిని తవ్వడం, చెట్టు, పుట్టలను కొట్టడం, కూరగాయల కోయడం, వంటలు చేయకూడదంటారు. కానీ ఇప్పుడు వీటిని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. పాములు రక్షకులు అని ఆరోగ్యం, సంతానోత్పత్తి, శ్రేయస్సును తీసుకొస్తాయని నమ్ముతారు.  ఈ పండుగ నాడు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల అనారోగ్యాలు,  దురదృష్టం నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం. నాగదేవతలకు పూజ చేయడం వల్ల కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. ముఖ్యంగా రైతులు నాగదేవతలను పూజిస్తారు. 

పఠించాల్సిన శ్లోకం 

నాగుల చవితి రోజు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం పఠించడం వల్ల బాధలు, దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని అంటారు. 

కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ 

రుతుపర్ణస్య రాజ కీర్తనం కలినాశనమ్ 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్