Karthika somavaram: కార్తీక సోమవారం వ్రత కథ ఏంటి? పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకోండి
Karthika somavaram: కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కైలాస ప్రవేశం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలానికి సంబంధించి వ్రత కథ మీకోసం అందిస్తున్నాం.
తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ప్రజలు ఈ మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. నిత్యం దైవ నామస్మరణతో మార్మోగిపోతుంది.
నేడు నవంబర్ 4 తొలి కార్తీక సోమవారం. కార్తీకమాసంలో వచ్చే సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఆచరించి రాత్రి దీపం వెలిగించి నక్షత్రాల దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసే వాళ్ళు శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక మహా పురాణం చెబుతోంది.
కార్తీక సోమవారం రోజు చేసే పూజ అత్యంత ఫలమైనదిగా చెబుతారు. ఈరోజు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు. కార్తీక సోమవారం నాడు స్నానం, దానం, జపం అనేది చేయడం చాలా ముఖ్యమైనవి. ఈ మాసంలో చేసే ఉపవాసాలు ఆరు రకాలుగా ఉంటాయి. ఒంటి పూట భోజనం, రాత్రిపూట భోజనం, ఛాయానక్త భోజనం, స్నానం, తిలదానం, పూర్తి ఉపవాసం అని ఆరు విధాలుగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. తిలదానం అంటే నువ్వులు దానం చేస్తారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వ్యక్తులు ఒంటిపూట భోజనం చేయవచ్చు. ఈ మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు.
కార్తీక సోమవారం పూజా విధానం
సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు. శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం, పూజలు చేస్తారు. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. ఈరోజు ఉపవాసం ఆచరిస్తారు. పూజ చేసుకునేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి.
ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ మాసంలో చేసే నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, అభిషేకాలు అత్యంత విశిష్టమైనవి. కార్తీకమాసంలోనే ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక సోమవారం ఉపవాసమాచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని నమ్ముతారు.
కార్తీక సోమవార వ్రత కథ
కార్తీక సోమవారం ఉపవాసాన్ని గురించి చెప్పే ఒక కథ స్కంద పురాణంలో ఉంది. పూర్వం కర్కశ అనే మహిళ ఉండేది. ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది. అందువల్ల మీకు కర్కశ అనే పేరు వచ్చింది. ఆమె ఎంతో మంచివాడైనా వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది. అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది. దీంతో తన జీవిత చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుజన్మలో శునకంగా పుట్టింది.
ఒకనాడు కార్తీక సోమవారం రోజు శునాకానికి ఆహారం ఎక్కడా లభించలేదు. పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరికి సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతం ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు. ఆకలితో ఉన్న శునకం ఆ ఆహారాన్ని తిన్నది. వెంటనే శునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది. తన గతం గురించి శునకం మనిషి భాషలో మొత్తం వేద పండితుడికి వివరించింది.
అయితే కార్తీక సోమవారం నాడు పగటిపూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మకు జ్ఞాపకం వచ్చిందని పండితుడు శునకానికి వివరించాడు. తనకు పుణ్యం కలిగేలాగా ప్రసాదించమని వేడుకుంది. అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి ధారపోశాడు. వెంటనే ఆమె శునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది. అలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొంటుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.