Hanuman temple: మట్టి ప్రమిదలే ఈ ఆలయం గోడలు- వినూత్నమైన ఈ హనుమాన్ దేవాలయం ఎక్కడ ఉందంటే
28 August 2024, 8:05 IST
- Hanuman temple: దీపాలు వెలిగించేందుకు మట్టి ప్రమిదలు ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఆలయం మాత్రం ఏకంగా ప్రమిదలతోనే నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇటుక, ఇసుక ఉండదు. మట్టి ప్రమిదలు, కలశాలతో ఆలయాన్ని నిర్మించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ఆలయానికి కలశ ఆలయం అని పేరు కూడా ఉంది.
ప్రమిదలతో నిర్మించిన హనుమాన్ ఆలయం
Hanuman temple: సాధారణంగా మట్టి దీపాలు పూజల సమయంలో లేదా పండుగ సమయంలో ఎక్కువగా వెలిగించేందుకు ఉపయోగిస్తారు. వాటిని నిమజ్జనం చేయడం లేదా భద్రపరుచుకోవడం చేస్తారు. కానీ ఇక్కడ మట్టి దీపాలు, కలశాలతో ఏకంగా ఒక ఆలయాన్ని నిర్మించారు.
సాధారణంగా ఇటుకలు, పాలరాయి, సిమెంటు వంటి వాటితో ఆలయాలలో నిర్మిస్తారు. కానీ ఛత్తీస్ ఘడ్ లోని దుర్గ్ ప్రాంతామ ధమఢా సమీపంలోని నిర్మిస్తున్న ఈ హనుమాన్ దేవాలయం మాత్రం ఇతర దేవాలయాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని కేవలం మట్టి దీపాలు, కలశాలతో నిర్మిస్తున్నారు. ఈ వినూత్నమైన ఆలోచన అక్కడ పూజారికి వచ్చింది.
పూజారి ఆలోచనకు ప్రతిరూపం
ధమఢా ప్రాంతంలో ఒకప్పుడు పూజకు ఉపయోగించిన కలశాలు, మట్టి దీపాలు చెల్లాచెదురుగా పడి ఉండేవి. ఇవి నిత్యం ప్రజలు కాళ్ళకు తగిలి ఇబ్బంది పెడుతూ ఉండేవి. ఆ ప్రదేశం మొత్తం వాటితో చిందరవందరగా మారడంతో అక్కడి ప్రజలు నిరాశ చెందారు. పవిత్రమైన దీపాలు, కలశాలు ప్రజల పాదాలను తాకడం మంచిది కాదని భావించి వాటిని సేకరించి ఒక ఆలయాన్ని నిర్మించడానికి ఉపయోగించాలని ఆలయ పూజారి నిర్ణయించుకున్నాడు.
గ్రామస్తుల నుంచి వందలాది కలశాలు, దీపాలను సేకరించారు. వాటిని ఒక చోట ఉంచడం ప్రారంభించారు. అలా ఆలయ పూజారి ఆ మట్టి దీపాలు కలశాలతో ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజారి వినూత్న ఆలోచన నుంచి వచ్చిన ఆలయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆలయ గోడలు మొత్తం కలశం దీపాలతో అలంకరించి ఉన్నాయి.
మట్టి దీపాలే గోడలు
అప్పట్లో వచ్చిన నవరాత్రి ఉత్సవాల తర్వాత నుంచి ఈ కలశాలు, దీపాలు తీసుకున్నందున వాటిలోని ప్రతి ఒక్కదాంట్లో సానుకూల శక్తి ఉందని నమ్ముతారు. సాధారణంగా దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. అయితే ఇక్కడ ఆలయమే దీపాలతో ఏర్పడుతోంది. గోడలు మొత్తం దీపాలతో అద్భుతంగా కనిపిస్తాయి. ఆలయం లోపల హనుమంతుడు కొలువై పూజలు అందుకుంటున్నాడు.
దాదాపు 15 సంవత్సరాలుగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ ఆలయం 50 అడుగులకు పైగా ఎత్తు ఉంటుందని అంటారు. సోషల్ మీడియాలో ఈ ఆలయం గురించి తెలుసుకున్న చాలా మంది ఈ ప్రత్యేకమైన ఆలయానికి తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు డబ్బు, కలశాలు, దీపాల రూపంలో విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఆలయ పూజారి చిన్నపాటి ఆలోచనతో ప్రారంభమైన ఈ ఆలయం ఇప్పుడు కొత్త కమ్యూనిటీ ప్రాజెక్టుగా మారిపోయింది.
సృజనాత్మకత ఉండాలే కానీ దేనినైనా ఉపయోగించుకోవచ్చు అనేందుకు ఈ ఆలయం నిదర్శనం. ఆలయ పూజారి వినూత్నమైన ఆలోచన ఇప్పుడు అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచింది. ఈ ఆలయంలో ప్రధాన ధైవం హనుమంతుడు. సర్వశక్తిమంతుడు దయగల దేవుళ్ళలో హనుమంతుడు ఒకరు. బలం, వినయానికి చిహ్నంగా భావిస్తారు.
తన నిజమైన భక్తులకు ఎల్లప్పుడూ ఉండగా నిలుస్తాడు. నవరాత్రులలో ఉపయోగించిన దీపాలు, కలిశాలను ఎక్కువగా ఇందులో ఉపయోగించడం వల్ల ఇందులో దేవి శక్తితో పాటు హనుమంతుని ప్రేమ, సానుకూల శక్తి కొలువై ఉంటుందని నమ్ముతారు.
టాపిక్