Temple Visit: గుడికి వెళ్ళగానే చేయాల్సిన మొదటి పనులు ఇవే
08 January 2024, 16:04 IST
- Temple: దేవాలయంలోకి వెళ్ళగానే నేరుగా మూల దర్శనం చేసుకోవడం ఎంత మాత్రం సరైన పద్దతి కాదని పండితులు చెబుతున్నారు. ఆలయానికి వెళ్ళిన తర్వాత మొదటగా ఏం చేయాలంటే..
గుడిలో కాసేపు ఎందుకు కూర్చుని వెళతారు?
Temple: పవిత్రమైన ప్రదేశం దేవాలయం. ప్రతీ ఒక్కరూ వారంలో ఒకరోజు అయినా గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటారు. మరికొంతమంది ఉదయం, సాయంత్రం వెళ్తూ ఉంటారు. దేవాలయాలు భగవంతుడిని పూజించే ప్రార్థనా స్థలాలు. నిత్యం మంగళహారతి, శ్లోకాలు, ఘంటానాదాలు, పురోహితుల వేద మంత్రాలు, భక్తి పాటలతో ఆలయం ఎంతో ప్రశాంతమైన ప్రదేశంగా ఉంటుంది.
ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని కాసేపు అక్కడ గడిపి వస్తే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుడికి వెళ్లేటప్పుడు మన మనసులోని చెడు ఆలోచనలు తొలగించుకోవాలి. శరీరం పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎలా పడితే అలా గుడికి వెళ్లకూడదు. గుడికి వెళ్ళే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం నడుచుకున్నప్పుడే భగవంతుని ఆశీర్వాదం మీకు దక్కుతుంది.
ఆలయంలో ప్రవేశించగానే చేయాల్సిన పనులు
చెప్పులు గుడి బయట విడిచి పెట్టి ఆలయంలో ప్రవేశించే ముందు మెట్లుకి నమస్కరించాలి. ఆలయ ప్రాంగణంలోని వెళ్ళగానే ట్యాప్ దగ్గరకి వెళ్ళి కాళ్ళు శుభ్రం చేసుకుని నీటిని తల మీద చల్లుకోవాలి. మొదటగా గోపురానికి తర్వాత సింహ ద్వారపు గడపకు నమస్కరించాలి. ఆ తర్వాత ధ్వజ స్తంభానికి దణ్ణం పెట్టుకోవాలి. ధ్వజ స్తంభం కుడి వైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయం లోపలికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా గుడిలోని కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. పూజ ముగించుకుని వెళ్లేటప్పుడు ధ్వజ స్తంభానికి ఎడమవైపు నుంచి బయటకి వెళ్ళాలి.
గుడిలోకి వెళ్ళిన తర్వాత గంటని మ్రోగించి క్షేత్రపాలకుడిని దర్శనం చేసుకోవాలి. గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. మనసులో కోరికలు నెరవేరుతాయి. తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవాలి. ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ దర్శనం చేసుకోకూడదు. దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడి వైపున లేదంటే ఎడమ వైపు నిలబడి దర్శనం చేసుకోవాలి.
విగ్రహాలు తాకరాదు
దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆలయ నిబంధనలు అతిక్రమించకూడదు. ఆలయంలో ఉన్న విగ్రహాలని తాకాలని చూస్తారు. కానీ అది మంచి పద్ధతి కాదు. విగ్రహాలని తాకడం వల్ల వాటి పవిత్రత దెబ్బతింటుందని చెబుతారు. కళ్ళు మూసుకుని దైవాన్ని తలుచుకుని తమ విన్నపాలు, చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవుడిని దర్శించుకునే సమయంలో మనసులోకి ఇతర ఆలోచనలు రాకూడదు. భగవంతుని మీద మనసు లగ్నం చేయాలి.
గుడిలో కాసేపు కూర్చుని వెళ్లాలంటారు ఎందుకు?
ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకుని తిరిగి వెళ్లేటప్పుడు కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చుని వెళ్లాలని చెప్తారు. కనీసం గుడి మెట్లు మీద అయినా నిమిషం పాటు కూర్చుంటారు. అలా చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి. ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని, ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని, దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలని మనసులో కోరుకుంటూ కాసేపు కూర్చోవాలి. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కొద్ది సేపు గుడిలో కూర్చోవడం వల్ల ఆ శక్తి మీ శరీరం మీదకి వస్తుందని మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని అంటారు.