Saturn transit: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి ఏలినాటి శని బాధలు తప్పవు
28 October 2024, 14:17 IST
- Saturn transit: శని వచ్చే ఏడాది తన రాసిని మార్చబోతున్నాడు. 2025 లో శని రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం కూడ మొదలవుతుంది. ఏయే రాశులు శని గుప్పిట్లో చిక్కుకోబోతున్నాయో తెలుసుకుందాం.
కొత్త ఏడాది శని సంచార ప్రభావం
జ్యోతిష్యంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శని గ్రహాన్ని పాపాత్మకమైన, క్రూరమైన గ్రహం అంటారు. జ్యోతిషశాస్త్రంలో శని రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. శనిదేవుడు అన్ని గ్రహాల కంటే నెమ్మదిగా కదులుతాడు.
శని దేవుడు దాదాపు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిచక్రాన్ని మార్చి తదుపరి రాశిలోకి ప్రవేశిస్తాడు. శని రాశి మారడం వల్ల కొంత లాభం, కొందరికి నష్టం జరుగుతుంది. శనిని చూసి అందరూ భయపడతారు. కానీ శని న్యాయంగా వ్యవహరిస్తాడు. మంచి పనులు చేసే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా పాపాలు చేస్తే అందుకు తగినట్టుగానే కర్మలు అనుభవించాల్సి వస్తుంది. శని రాశి మారడం వల్ల కొన్ని రాశుల మీద శని గ్రహం ఏలినాటి శని, అర్థాష్టమ శని మొదలవుతుంది.
ప్రస్తుతం శని తన సొంత రాశి కుంభంలో సంచరిస్తున్నాడు. అందువల్ల 2024 శని సంవత్సరంగా పిలుస్తారు. వచ్చే ఏడాది శని తన రాశిని మార్చబోతున్నాడు. కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఏలినాటి, అర్థాష్టమ శని నుంచి విముక్తి కలుగుతుంది. శని రాశిలో మార్పు ఐదు రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం కుంభ, మకర, మీన రాశులలో ఏలినాటి శని కొనసాగుతుండగా కర్కాటక, వృశ్చిక రాశుల్లో అర్థాష్టమ శని కొనసాగుతున్నాయి.
కొత్త సంవత్సరం వీరికి తిప్పలే
శనిదేవుడు 2025లో రాశిని మారుస్తాడు. మార్చి 29, 2025న శనిగ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. శని రాశులు మారిన వెంటనే కొన్ని రాశుల వారికి ఏలినాటి శని, అర్థాష్టమ శని నుంచి ఉపశమనం లభిస్తే, మరికొందరికి వీటి వల్ల బాధలు మొదలవుతాయి.
మీన రాశిలోకి శని ప్రవేశంతో మేష రాశి వారికి శని సడే సతి ప్రారంభమవుతుంది. శని సంచారంతో మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే కుంభ రాశి వారికి ఏలినాటి శని మూడో దశ, మీన రాశి వారికి రెండవ దశ, మేష రాశి వారికి మొదటి దశ మొదలవుతాయి. దీనితో పాటు శని సంచారం వల్ల సింహ, ధనుస్సు రాశుల వారికి అర్థాష్టమ శని ప్రారంభం కాబోతుంది. అందువల్ల రానున్న రెండున్నర సంవత్సరాల పాటు ఈ ఐదు రాశుల వారికి శని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మీద దాని ప్రభావం కనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
వీరికి అర్థాష్టమ శని ప్రభావం
శని మీనంలోకి ప్రవేశించిన వెంటనే మకరం నుండి శని సడే సతి తొలగిపోతుంది. అలాగే శని రాశి మారడం వల్ల కర్కాటక, వృశ్చిక రాశుల వారికి ఉన్న అర్థాష్టమ శని నుంచి విముక్తి కలుగుతుంది. అర్థాష్టమ శని ప్రభావం రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. కానీ ఏలినాటి శని మాత్రం మూడు దశలలో ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది. దీని వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.