Home vastu tips: ఇంట్లోకి సంపద రావాలంటే ఈ పనులు చేయాల్సిందే
18 January 2024, 13:15 IST
- Home vastu tips: ఆర్థిక కష్టాలతో విసిగిపోయారా? ఈ వాస్తు చిట్కాలు పాటించడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది.
సంపదని ఆకర్షించే వాస్తు చిట్కాలు
Home vastu tips: కొంతమంది ఎంత సంపాదిస్తున్నా కూడా అప్పుల భారం పెరుగుతూనే ఉంటుంది. ఆదాయం ఉంటుంది కానీ చేతిలో డబ్బు నిలవకుండా పోతుంది. అందుకు వాస్తు దోషాలు కూడా కొన్ని కారణాలు కావచ్చు. అదృష్టం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ఆకర్షించేందుకు ఇంట్లో వస్తువులు సరైన దిశలో ఉంచాలి.
వాస్తు ప్రకారం ఇంటిని ఉంచుకుంటే డబ్బు నిలుస్తుంది. సంపదని ఆకర్షిస్తుంది. వాస్తు యంత్రాల నుంచి వస్తువులు ఏర్పాటు వరకు ఏవి ఎక్కడ ఉంచాలో తెలుసుకుంటే మంచిది. ఇల్లు ఇలా సర్దుకోవడం వల్ల సానుకూల శక్తి ఇంట్లో ఉంటుంది. కొన్ని వాస్తు చిట్కాలు పాటించడం వల్ల ఆర్థిక సమృద్దికి ఎటువంటి లోటు ఉండదు.
ఇంటి ప్రధాన ద్వారం
ఇంటికి ప్రధాన ద్వారం సరైన దిశలో ఉండాలి. బాగా వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. సంపదని ఆకర్షించేందుకు ప్రధాన ద్వారం ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆర్థికంగా పుంజుకుంటారు. ఎటువంటి అడ్డంకులు ఉండవు.
డోర్ మ్యాట్ కూడా ముఖ్యమే ‘
చాలా మంది డోర్ మ్యాట్ ని కేవలం కాళ్ళు తుడుచుకునే పట్ట మాదిరిగానే చూసుకుంటారు. కానీ డోర్ మ్యాట్ కూడా సరిగా ఉంచాలి. ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఇంటి గుమ్మం ముందు వేసే డోర్ మ్యాట్ కింద కొన్ని స్పటిక ఉంచండి. ప్రతి శనివారం దీన్ని మారుస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్న ఏవైనా అవాంఛిత శక్తులని తొలగించి వేయడంలో సహాయపడుతుంది.
పనికిరాని వస్తువులు తీసేయాలి
ఇంటిని చక్కగా, క్రమ బద్ధంగా సర్దుకోవాలి. అనవసరమైన, పనికిరాని వస్తువులు వెంటనే తొలగించాలి. పాత ఇనుము వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అందుకే వాటిని తీసేయాలి. అప్పుడే సానుకూల శక్తి ఇంట్లో స్వేచ్చగా ప్రసరించేందుకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
అక్వేరియం
మీ గదిలో ఆగ్నేయ మూలలో చేపల అక్వేరియం ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. శ్రేయస్సు ఉంటుంది. ఫెంగ్ షూయి శాస్త్రం ప్రకారం అక్వేరియంలో గోల్డ్ ఫిష్ పెట్టుకోవాలని అనుకుంట వాటిని బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. అక్వేరియంలో ఒక నల్ల చేప కూడా ఉండేలా చూసుకోవాలి.
వాస్తు దేవతా యంత్రం
వాస్తు దేవతా యంత్రం ప్రత్యేకంగా మీ ఇంట్లో సానుకూల శక్తులని ఆకర్షించేలా చేస్తుంది. ఇవి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం శ్రేయస్కరం. ఇంటి గుమ్మానికి తగిలించడం వల్ల ఇంట్లోకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ శక్తులు ప్రవేశిస్తాయి.
లాకర్ దిశ
డబ్బు, ఫైనాన్స్ కి సంబంధించిన వస్తువులు ఉంచే లాకర్ దిశ కూడా సరిగా ఉండాలి. డబ్బులు ఉండే అల్మరా లేదా లాకర్ ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. లాకర్ ని తప్పు దిశలో ఉంచడం వల్ల అధిక వ్యయం, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి.
కుబేర యంత్రం
చాలా మంది తమ ఇళ్ళలో కుబేర యంత్రం కూడా పెట్టుకుంటారు. సంపదకి అధిపతి కుబేరుడు. శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు. ఇంటి ఈశాన్య మూలలో కుబేర యంత్రాన్ని ఉంచడం వల్ల డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
మనీ ప్లాంట్
ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా కూడా మనీ ప్లాంట్ తీగలు దర్శనం ఇస్తున్నాయి. ఇవి ఉండటం వల్ల డబ్బుని ఆకర్షిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఆగ్నేయ మూలలో పచ్చని కుండీలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది.
వాస్తు పిరమిడ్
వాస్తు పిరమిడ్ ఇంటి లోపల శక్తిని సమతుల్యం చేస్తుంది. దీన్ని ఇంటి ఆగ్నేయ మూలలో ఇత్తడి లేదా క్రిస్టల్ తో చేసిన పిరమిడ్ ఉంచడం వల్ల సానుకూలత, శ్రేయస్సు పెరుగుతాయి.
ట్యాప్ లీక్ లేకుండా చూడాలి
లీకైన కుళాయిలు ఉంటే వెంటనే ఇంట్లో బాగు చేయించుకోవడం మంచిది. ట్యాప్ లీకేజ్ ఉంటే చేతిలోని డబ్బు వృధా అవుతుంది అనేందుకు చిహ్నంగా భావిస్తారు. అందుకే ఎప్పుడు నీరు లీకేజ్ లేకుండా చూసుకోవాలి. లేదంటే డబ్బు నష్టం జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.