ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యం.. ఈ ఆలయం ఎక్కడ ఉంది? విశిష్టత ఏంటి?
28 May 2024, 10:20 IST
- ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యం ఏంటి? ఈ శివాలయం ఎక్కడ ఉంది? దాని విశిష్టత ఏంటి? బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇవీ.
ఓంకారేశ్వర ఆలయం
భారతీయ సనాతన ధర్మంలో స్థితికారకుడైనటువంటి మహావిష్ణువును, అలాగే లయకారకుడైనటువంటి పరమేశ్వరుని మరియు శక్తి రూపమైనటువంటి అమ్మవారిని ఆరాధించు విధానాలు ఉన్నాయి. మహా విష్ణువును పూజించేటటువంటి వారు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు లేదా బదరీనాథ్, రామేశ్వరం, ద్వారక మరియు పూరీ జగన్నాథ్ వంటి నాలుగు ధామాలకు ప్రాధాన్యత ఇస్తారు.
శక్తి స్వరూపిణీ అయినటువంటి అమ్మవారి విషయములో అష్టాదశ శక్తి పీఠాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శివారాధన విషయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఓంకారేశ్వర క్షేత్రం ఒకటని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ క్షేత్రం వింధ్య పర్వతాల మధ్య ఉంటుంది. ఈ క్షేత్రం ఓంకార రూపంలో ఉండటం చేత ఈ స్వామికి ఓంకారే శ్వర స్వామిగా పేరు వచ్చినట్లుగా చిలకమర్తి తెలిపారు. పరమ పవిత్రమైనటువంటి నర్మదా నది ప్రవహించే ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రం. ఈ ఓంకార క్షేత్రములో నర్మదా నది ప్రవాహానికి కుడివైపు ఓంకారారేశ్వరుడు ఎడమ వైపు అమలేశ్వరుడు ఉంటారు. ఈ రెండు జ్యో తిర్లింగాలను దర్శిస్తేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పూర్తవుతుందని చిలకమర్తి తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాంద్వా జిల్లాలోని ఖాంద్వా పట్టణ సమీపంలో ఉన్న ఈ ఓంకేరాశ్వర క్షేత్రానికి శంకరాచార్యుల వారు విచ్చేసినట్లుగా, శంకరాచార్యుల గురువైనటువంటి గోవింద భగవత్పాదను నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర క్షేత్రములో కలుసుకున్నట్లుగా మనకి శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్రలో చెప్పబడిందని చిలకమర్తి తెలిపారు.
ఓంకారేశ్వర క్షేత్రం పురాణ కథ ఇదీ
ఒకప్పుడు నారదుడు శివుని ఆరాధించడం కోసం గోకర్ణ క్షేశ్రానికి వెళ్ళి తిరిగి వస్తూ వింధ్య పర్వతం దగ్గరకు వచ్చాడు. వింధ్య పర్వతుడు నారద మహర్షికి స్వాగతం చెప్పి నేను పర్వత రాజును, సర్వ సంపన్నుడను, ఏ ఏ విషయంలోను లోపం లేదు అని గర్వంగా పలికాడు.
అపుడు నారదుడు అతని గర్వం అణచదలచి మేరువుతో పోలిస్తే నీవెంతటివాడవు అని ఈసడించాడు. అపుడు వింధ్యుడు బాధపడి ఓంకార క్షేత్రమును వెళ్ళి అక్కడ ఒక పార్ధివ లింగాన్ని నిర్మించి ఏకదీక్షతో శివునికై తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు.
ఈ తపస్సుతో ప్రసన్నముగా నుండునట్లు పర్వతరాజు వరం పొందుతాడు. అలాగే యెల్లప్పుడు తన శిరస్సుపై నిలచియుండాలని కోరుతాడు. శివుడు తధాస్తు అంటాడు. ఈ నేపథ్యంలో శివుడు పార్ధివాకారంలో అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అను రెండు రూపాలతో అక్కడ ఆవిర్భవించాడు. ఈ రెండు లింగాల రూపంతో నున్న శివుడు ఒకే జ్యోతిర్లింగముగా భావించాలని చిలకమర్తి తెలిపారు.
ఈ క్షేత్రంలో నర్మదానది నర్మద, కావేరి అను రెండు పాయలుగా ప్రవహిస్తోంది. ఈ రెండు పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని మంధాతృపురి, శివపురి అనే పేర్లతో పిలుస్తారు.
పరమార్ రాజుల తర్వాత ఈ క్షేత్రం ముస్లిముల దండయాత్రల వలన శిధిలావస్థకు చేరుకుంది. తర్వాత మరాఠాలు తిరిగి పునరుద్ధరించారు.
కోటి తీర్ధము, కోటేశ్వర, హాటరేశ్వర, త్రయంబకేశ్వర, గాయత్రీ గోవిందేశ్వర, సావిత్రీశ్వర, భూరీశ్వర శ్రీకాళికా, పంచముఖ గణేశ్వర వంటి దర్శనీయ స్థలాలు ఇక్కడ చూడొచ్చని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు