తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri 8th Day: నవరాత్రి ఎనిమిదో రోజు దుర్గాదేవి అవతారం- విశిష్టత, పూజా విధానం

Navaratri 8th day: నవరాత్రి ఎనిమిదో రోజు దుర్గాదేవి అవతారం- విశిష్టత, పూజా విధానం

HT Telugu Desk HT Telugu

09 October 2024, 18:59 IST

google News
    • Navaratri 8th day: శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతారం విశిష్టత ఏంటి, ఈరోజు కన్యా పూజ ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి అధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 
దేవి నవరాత్రులు 2024
దేవి నవరాత్రులు 2024

దేవి నవరాత్రులు 2024

శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు సరస్వతీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇక దేవీ న‌వ‌రాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తార‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

'దుర్గామాత' అని తలవగానే మన మదిలో త్రిశూలధారియై, వ్యాఘ్రవాహన అయి, శరణు కోరినవారిని రక్షించే చల్లని చూపుతో ప్రత్యక్షమవుతుంది. ఆ సకల శక్తి స్వరూపిణిని 'ఓం కాత్యానాయ విద్మహే | కన్యకుమారి ధీమహీ! తన్నో దుర్గీ ప్రచోదయాత్!' అంటూ ప్రార్ధన చేసి ఆరాధిస్తే, భక్తుల దుర్గతులు దూదిపింజల్లా ఎగిరిపోతాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

దుర్గముడనే అసురుని సంహారం చేయడానికి దుర్గాదేవిగా ఆవిర్భవించింది మహేశ్వరి అని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. రక్కసుని ఎలా అంతమొందించిందో భక్తుల కష్టాలను కూడా దుర్గాదేవి అలాగే రూపుమాపుతుంది. రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులు కలుగుతాయి.

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంతో పాటు శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేసుకుంటే భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి. దుర్గాష్టమి నాడే 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పూజ చేసి, తాంబూలాలు, కానుకలు ఇస్తారు. దీన్ని కన్యా పూజ అంటారు. బాలికల్లో దుర్గాదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే తొమ్మిది మంది బాలికలను ఇంటికి పిలిచి వారిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు.

ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు పొందినట్టుగా భావిస్తారు. పూజ చేసిన తర్వాత ఖీర్ సమర్పించి దక్షిణ తాంబూలం అందిస్తారు. బొమ్మలకొలువు పేరంటం కొనసాగిస్తారు. సరస్వతీదేవి పూజ నాడు మొదలు పెట్టిన త్రిరాతవ్రతం ఈ రోజు కొనసాగిస్తారు. ఈ విశిష్ట పర్వదినాన శ్రీ దుర్గా దేవికి మిక్కిలి ప్రీతికరమైన పులగాన్నం, పులిహార నివేదన చేస్తే చాలా ఫలప్రదం. ఈరోజు పూజకు ఎరుపు రంగు ధ‌రిస్తే మంచిద‌ని పంచాంగకర్త చిల‌క‌మ‌ర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం